Vivek Venkataswamy: స్వేచ్ఛ బ్యూరో: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తనకు మూడు నెలల పాటు ఇరిగేషన్ మంత్రి పదవి ఇస్తే కాళేశ్వరం ప్రాజెక్టును సరిచేస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర గనులు, భూగర్భశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావుపై ఘాటు విమర్శలు చేశారు.
క్షమాపణ చెప్పకుండా.. మళ్లీ పదవా?
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మూడు సంవత్సరాల పాటు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ప్రాజెక్టు కుంగిపోయిన తర్వాత తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా మరోసారి తనకు మూడు నెలల మంత్రి పదవి ఇవ్వాలని అడగడం సిగ్గుచేటని అన్నారు. నిజంగా అంతటి మేధావి అయితే కాళేశ్వరం నిర్మాణం జరుగుతున్న సమయంలోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను ఇరిగేషన్ శాఖ నుంచి ఎందుకు తప్పించారో ముందుగా ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు.
Also Read: హైకోర్ట్‌ను ఆశ్రయించిన ‘ప్రశ్న’ రావణ్ భార్య.. అవన్నీ తిరిగి ఇచ్చేయాలంటూ..
అందుకే కేసీఆర్ నిన్ను తీసేశారు!
హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న కాలంలో జరిగిన అవినీతి, అక్రమాల వల్లే ఆయనను ఆ శాఖ నుంచి పక్కన పెట్టారని ఆరోపించారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కాంట్రాక్టర్లు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా మారారని, ప్రజల ధనం కొందరి చేతుల్లోకి వెళ్లిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన వైఫల్యాలకు బాధ్యత వహించాల్సిన నాయకులు ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.
ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం
కల్వకుంట్ల కుటుంబంలో హరీష్ రావు, కేటీఆర్, కవిత మధ్య ఆధిపత్య పోటీ నడుస్తోందని, ఆ కుటుంబ అంతర్గత రాజకీయాలను ప్రజలపై రుద్దేందుకు ప్రతిరోజూ ఏదో ఒక వివాదాన్ని సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మీడియాలో కనిపించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ముందుగా తమ పదేళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖ ఎందుకు విఫలమైందో, కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు దెబ్బతిన్నదో ప్రజలకు వివరించాలని హరీష్ రావును మంత్రి వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ నాయకులదేనని ఆయన స్పష్టం చేశారు.
Also Read: రూ.11,569 కోట్ల పెట్టుబడులు.. సోషల్ మీడియాపై ఉక్కుపాదం.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!