అది రైతు ఆశీర్వాద సభ లెక్క లేదు. అసెంబ్లీ ఎన్నికల కోసం నిర్వహించిన భారీ బహిరంగ సభలా ఉంది. సీఎం రేవంత్ ప్రసంగం ఆసాంతం అలాగే కొనసాగింది. రైతుల అంశం వచ్చినా.. ఆ గణంకాలన్నీ వివరించినా.. అన్నీ పాత వివరాలే. పాత ప్రసంగమే. కానీ అంతకు మించిన ఛాలెంజ్ ఈ సభకు హైలెట్‌గా నిలిచింది.
దాదాపు సగం పాలన ముగిసింది. ఇంకా సగం టర్ము ఉంది. కానీ ఇప్పుడే రేవంత్ శపథం పూనాడు. ఒట్టు పెట్టుకున్నాడు. ప్రతిజ్ఞ చేశాడు. జోస్యం చెప్పాడు. మేమే మళ్లీ వస్తున్నామని. దీనికి తిరుగులేదని. అప్పుడు ఎన్నికలకు ఆరు నెలల ముందే.. మేమే వస్తున్నామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇప్పుడు 30 నెలల ముందే అవే మాటలు చెబుతున్నానన్నాడు.
సర్వేలో పేరుతో నానా యాగీ చేస్తున్న బీఆరెస్ మళ్లీ రాదన్నాడు. ఇక దాన్ని మొలకెత్తనీయమని, కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌లనే బంధిస్తామని కూడా శపథం చేశాడు రేవంత్. రాబోయే ఎన్నికల వాతావరణం పట్ల తాను ఎంత క్లారిటీగా ఉన్నాడో వివరించాడు. కేంద్రంలో బీజేపీ బలం పెరిగి.. బలవంతంగానైనా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగి తీరుతుందని కూడా జోస్యం చెప్పాడు. భవిష్యవాణి వినిపించాడు.
ఏం జరగబోతుందో బహిరంగ సభ వేదికగా ఖుల్లం ఖుల్లాగా ప్రకటించాడు. అసెంబ్లీ సీట్లు ఎన్ని పెరుగుతాయి? పెరిగిన పార్లమెంటులో ఎన్ని గెలుస్తాము? కచ్చితమైన రిపోర్టును ముందు పెట్టాడు. సర్వేలు చేసుకున్న బీఆరెస్‌ను తుక్కు తుక్కు తిట్టిన ఆయన.. తను మాత్రం జనం నాడి తెలిసిన వాడిగా చెబుతున్నానన్నాడు. జనం గుండె చప్పుడు తనకు తెలుసునన్నాడు. అందుకే ఈ ధైర్యం, ఈ ధీమా.. ఈ స్పష్టత అని వివరించాడు.
తన లెక్క ఎప్పుడూ తప్పదని గతం గుర్తు చేశాడు. నేల విచిడి సాము చేయనన్నాడు. గాలిలో మేడలు కట్టే తత్వం తనది కాదన్నాడు. ప్రజలకు ఉపయోగపడే ఏ పథకాన్నీ ఆపలేదన్నాడు. అదనంగా కొత్త పథకాలు ఇచ్చి చూపామని, ఇలాంటి ప్రజాపాలనను వదలుకునేందుకు జనాలు సిద్దంగా లేరని .. ప్రజల తరుపున వకాల్తా పుచ్చుకున్నాడు.
సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత కరెంటు, ఉచిత బస్సు ప్రయాణం, సిలిండర్ సబ్సిడీ, ప్రభుత్వ ఉద్యోగాల కల్పన.. ఇవి చాలవా తమను మళ్లీ గెలిపించడానికి. ఏకంగా అవినీతి సొమ్ముపై ఆ ఇంటి ఆడబిడ్డే బీఆరెస్ పై ఫిర్యాదు చేస్తున్నారని, ఇంకా ఏ ముఖం పెట్టుకుని గెలుస్తామని అంటున్నావని కేటీఆర్‌ను డిఫెన్స్‌లో పడేసే ప్రయత్నం చేసిన రేవంత్.. హరీశ్ బీజేపీలోకి వెళ్లడని మీకు నమ్మకం ఉందా, అయితే కేసీఆర్ మీద, భద్రాద్రి రాముడి మీద ఒట్టేసి చెబుతారా? అని మరింత ఇరకాటంలో పెట్టేలా కామెంట్స్ చేశాడు.
బావబామ్మర్దులు పల్లీ బఠానీలు అమ్ముకోవాల్సి వస్తుందని, కేటీఆర్‌ను సోంబేరి అంటూ కామెంట్ చేశాడు రేవంత్. కేటీఆర్‌కు ఏం తెలుసు.. పబ్బులకు పోవడం.. గబ్బు పనులు చేయడం తప్ప.. అని నైతికత మీద దెబ్బకొట్టే ప్రయత్నం చేశాడు. ఎన్నికలు ఎప్పుడు రాబోతున్నాయో కూడా జోస్యం చెప్పిన రేవంత్.. భవిష్యవాణి మొత్తం వినిపించి.. ఇక దీన్ని నిజం చేసుకోవడానికి రోజుకు 18 గంటలు పనిచేస్తామని కూడా చెప్పుకొచ్చాడు. ఈ సభ రాజకీయంగా దుమారం రేపింది. ఎప్పుడో జరగాల్సిన ఎన్నికల మూడ్‌ను ఇప్పుడే తెచ్చిపెట్టింది.