Sharmila : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. తెలంగాణ ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ను ఓడించడం తన ఉద్దేశం కాదన్నారు. కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత తారాస్థాయికి చేరిందన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. అందుకే పోటీకి దూరంగా ఉంటున్నామన్నారు. కాంగ్రెస్ కు అధికారం వచ్చే అవకాశం ఉందని షర్మిల జోస్యం చెప్పారు. ఆ పార్టీకే ఓటు వేయాలని ప్రజలకు షర్మిల పిలుపునిచ్చారు.
చాలామంది మేధావులు సంప్రదించిన తర్వాతే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నానని షర్మిల వివరించారు. కర్ణాటకలో గెలిచాక ఇక్కడ కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందన్నారు. ఆ పార్టీని తాను ఎప్పుడు వేరుగా చూడలేదన్నారు. కాంగ్రెస్ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీగా పేర్కొన్నారు.
పాలేరు నియోజకవర్గం విషయంలో షర్మిల భావోద్వేగం చెందారు. కన్నీటితో ప్రజలకు అభివాదం చేశారు. పోటీ నుంచి తప్పుకున్నందుకు వైఎస్ ఆర్టీపీ శ్రేణులకు, పార్టీ కార్యకర్తలకు , నేతలకు , క్షమాపణలు చెప్పారు. రాజకీయంగా తీసుకున్న నిర్ణయంపై ఎవరైనా బాధ పడితే మన్నించాలని కోరారు.
పాలేరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనపై ఉందన్నారు. అక్కడ పోటీ చేస్తానని మాట ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పాలేరులో తాను చేసిన ప్రతి పోరాటంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వెంట ఉన్నారని తెలిపారు. దివంగత సీఎం వైెఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సమయంలో తమ కుటుంబానికి ఎంతో అండగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు పొంగులేటి అక్కడ పోటీలో ఉన్నారని.. తాను ఏం చేయాలో ప్రజలు చెప్పాలని కోరారు. తెలంగాణ ప్రజల కోసం తాము పడ్డ కష్టం ఎప్పటికి వృథా కాదని స్పష్టం చేశారు. గెలుపు కన్నా త్యాగం ఇంకా గొప్పది వేదాంత ధోరణిలో మాట్లాడారు.