భారతీయ రైల్వేకు సుమారు 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ముంబైలో తొలిసారి రైలు సేవలు ప్రారంభం కాగా, ఇప్పుడు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకుంది. తొలుత రైళ్లు ఆవిరి ఇంజిన్లతో నడవగా, ఆ తర్వాత బొగ్గుతో నడిచే రైళ్లు వచ్చాయి. ఆ తర్వాత తరంలో డీజిల్ లోకో మోటివ్స్ అందుబాటులోకి వచ్చాడు. ఇప్పుటి రైళ్లు విద్యుత్ తో నడుస్తున్నాయి. త్వరలోనే నీటితో(హైడ్రోజన్)తో నడిచే రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. తాజాగా దేశంలో సోలార్ పవర్ తో నడిచే రైలు పట్టాలెక్కింది. సుమారు 2.5 కిలో మీటర్లు ప్రయాణించే ఈ మినీయేచర్ రైలు పర్యాటకులకు సేవలను అందిస్తోంది. ఇంతకీ ఈ రైలు ప్రత్యేకత ఏంటి? ఎక్కడ నడుస్తుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
దేశంలో తొలిసారిగా సౌర విద్యుత్ తో నడిచే రైలు కేరళలో ప్రారంభం అయ్యింది. తిరువనంతపురం సమీపంలోని అందమైన వెలి టూరిస్ట్ విలేజ్ లో ఈ మినీయేచర్ రైలు అందుబాటులోకి వచ్చింది. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీనిని ప్రారంభించారు. సుమారు రూ. 10 కోట్ల వ్యయంతో దీనిని కేరళ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ వినూత్న పర్యావరణ ప్రాజెక్ట్ ను పర్యాటక రంగాన్ని మరింత మెరుగు పరిచేందుకు ఉపయోగపడుతుందని భావిస్తోంది. సందర్శకులకు, ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకునేలా దీనిని రూపొందించారు.
ఈ మినీయేచర్ రైలు సుమారు 2.5 కి.మీ ప్రయాణిస్తుంది. మొత్తం మూడు బోగీలను కలిగి ఉన్న ఈ రైలు ఒకసారి 45 మందిని తీసుకెళ్తుంది. ఈ రైలుకు సంబంధించి స్టేషన్, టికెట్ ఆఫీస్, టన్నెట్ మార్గం కూడా ఉంది. ఒక పర్యాటక ప్రదేశంలో ప్రయాణించే సాధారణ రైలు ఎలా ఉంటుందో.. ఈ రైలు కూడా అలాంటి లక్షణాలను కలిగి ఉంటుంది. వింటేజ్ స్టీమ్ లోకోమోటివ్ తరహాలో రూపొందించబడిన ఇంజిన్, క్లాసిక్ రైల్వే నోస్టాల్జియాను కలిగించేందుకు కృత్రిమ ఆవిరిని కూడా విడుదల చేస్తుంది. “పర్యావరణ అనుకూలమైన మినీయేచర్ రైల్వే సందర్శకులు వెలి సహజ ఆకర్షణను ఆస్వాదించడానికి, స్వచ్ఛమైన సౌర శక్తిని ప్రోత్సహించడానికి అనుమతిస్తుంది” అని ముఖ్యమంత్రి విజయన్ వెల్లడించారు. ఉత్పత్తి అయ్యే మిగులు సౌర విద్యుత్తును కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు (KSEB) గ్రిడ్ లోకి పంపుతామని తెలిపారు.
వెలి టూరిస్ట్ విలేజ్ లో సోలార్ పవర్ రైలుతో పాటు అర్బన్ పార్క్, స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభించారు సీఎం విజయన్. వీటి కోసం రూ. 7.5 కోట్లు ఖర్చు చేశారు. వెలి సౌకర్యాలను అంతర్జాతీయ ప్రమాణాలకు పెంచడానికి రూ. 60 కోట్లు వెచ్చించారు. పర్యాటక సౌకర్యాల కేంద్రం, కన్వెన్షన్ సెంటర్, ఆర్ట్ కేఫ్, ఆర్ట్ గ్యాలరీ, ఓపెన్ ఎయిర్ థియేటర్ లాంటి అదనపు సౌకర్యాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కేరళ పర్యాటక రంగానికి రూ. 120 కోట్లకు పైగా కేటాయించడంతో, వెలిని రాష్ట్రంలోని ప్రధాన టూరిస్ట్ డెస్టినేషన్స్ లో ఒకదానిగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తెలిపారు.
Read Also: నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ.. తెలుగు రాష్ట్రాలకు?