Fee Reimbursement: ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో కళాశాల యాజమాన్యాలు తమ నిరసన కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాయి. ఫీజు బకాయిలకు సంబంధించి యాజమాన్యాలు మొత్తం రూ. 1500 కోట్లు అడగగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
ప్రభుత్వం ఇప్పటికే రూ. 600 కోట్లు విడుదల చేసిందని, తక్షణమే మరో రూ. 600 కోట్లు విడుదల చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. మిగిలిన రూ. 300 కోట్లను కూడా కొద్ది రోజుల్లో చెల్లిస్తామని భరోసా ఇవ్వడంతో యాజమాన్యాలు తమ ఆందోళనను విరమించుకున్నాయి. రేపటి(శనివారం) నుంచి కాలేజీలు యధావిధిగా తెరచుకోనున్నాయి.
ఫీజు రియంబర్స్‌మెంట్‌పై యాజమాన్యాల కోరిక మేరకు త్వరలో ఒక కమిటీ వేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ కమిటీలో అధికారులు, యాజమాన్యాల ప్రతినిధులు ఉంటారని, సంస్కరణలపై చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో, తలపెట్టిన లెక్చరర్ల ప్రదర్శనను రద్దు చేసుకుంటున్నట్లు ‘పాతి’ జనరల్ సెక్రెటరీ రవికుమార్ ప్రకటించారు.
‘పాతి’ అధ్యక్షుడు నిమ్మటూరి రమేష్ మాట్లాడుతూ.. తాము అధికారులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కొన్ని మీడియా సంస్థలు తమ మాటలను వక్రీకరించాయని స్పష్టం చేశారు. సమ్మె వల్ల నిలిచిపోయిన పరీక్షలను యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి త్వరగా నిర్వహిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ప్రభుత్వం వద్ద సుమారు రూ. 10 వేల కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, నవంబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు కళాశాలలను బంద్ చేసి యజామాన్యాలు తమ నిరసనను వ్యక్తం చేశాయి. బకాయిలు త్వరలోనే జమ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి హామీ ఇవ్వడంతో యాజమాన్యాలు బంద్‌ను ఉపసంహరించుకున్నాయి.