Weather Alert: ఏపీకి వర్ష సూచన వెలువడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పలు జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరిక జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
నేటికి వాయుగుండంగా బలపడే అవకాశం..
ఉత్తర, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ నేటికి వాయుగుండంగా మారనుందని పేర్కొంది. శనివారం ఉదయానికి ఇది దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వివరించారు.
సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్న ఏపీఎస్‌డీఎంఏ..
దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు అధికారులు. ఈ నేపథ్యంలో సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు..
నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇక శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి వరకు ఉన్న కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొన్నారు.
అలాగే, శనివారం ఉత్తరాంధ్రతో పాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి వర్షాలు..
తెలంగాణలో వరుణుడు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా కుమ్మేస్తున్నాడు. మధ్యాహ్నం వరకు బ్రేక్ ఇచ్చినట్టు కనిపించిన రాత్రి సమయంలో భారీ వర్షం కురుస్తుంది. అయితే ఈ వర్షాలు మరో మూడు రోజులు ఇలానే ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వికారాబాద్, నిర్మల్, భూపాలపల్లి, కామారెడ్డి, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్, కరీంనగర్, జగిత్యాల, మహబూబాబాద్, నిజామాబాద్, వరంగల్, సిరిసిల్లా, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షం కురిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
వాతావరణశాఖ హెచ్చరికలు జారీ
వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రాంతాల ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.