Jubilee Hills Byelection: నవంబర్ 11న జూబ్లిహిల్స్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దమైంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో, ఇక్కడ ఉపఎన్నికల అనివార్యమైంది. మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగారు. ఈ సందర్భంగా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ.. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత ఎక్స్ వేదికగా వీడియోను పంచుకున్నారు. తన భర్త ఆశయ సాధన కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు.
తన భర్త ఆకస్మిక మరణంతో తమ కుటుంబం ఊహించని కష్టకాలంలో ఉన్నప్పుడు, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ తమకు అండగా నిలబడ్డారని ఆమె పేర్కొన్నారు. వారు తమను ఒక కుటుంబ సభ్యురాలిగా, ఇంటి ఆడబిడ్డగా ఆదరించి, ఈ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు పూర్తి మద్దతు ఇచ్చారని సునీత వివరించారు. కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ, కేవలం తమను నమ్ముకున్న ప్రజలకు అండగా నిలబడాలనే బలమైన ఉద్దేశ్యంతో, కేసీఆర్ ఆశీస్సులతోనే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
ప్రచారంలో భాగంగా నియోజకవర్గ ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు, తన భర్త ఎవరినైతే తన సొంత కుటుంబంగా భావించారో, ఆ ప్రజలను, వారి అభిమానాన్ని చూసి తాను భావోద్వేగానికి గురయ్యానని సునీత తెలిపారు. ఆ సమయంలో తన భర్త గుర్తుకురావడంతో కన్నీళ్లు తట్టుకోలేకపోయానని, అయితే తన ఆవేదనను కూడా కొందరు రాజకీయంగా హేళన చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళ ధైర్యంగా ముందుకు వచ్చి, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మొండి ధైర్యంతో తను అనుకున్నది సాధించాలని అనుకోవడంలో తప్పేముందని ఆమె ప్రశ్నించారు.
గతంలో ‘మీ గోపన్న’ (గోపీనాథ్) మీ కష్టసుఖాల్లో ఎలా అండగా నిలబడ్డారో, ఇప్పుడు తన ఈ కష్టకాలంలో జూబ్లీహిల్స్ ప్రజలందరూ ‘మీ ఇంటి ఆడబిడ్డ’గా భావించి తనకు అండగా నిలబడాలని సునీత విజ్ఞప్తి చేశారు. నవంబర్ 11న జరిగే ఉప ఎన్నికలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. బ్యాలెట్‌లో 3వ నంబర్‌పై నొక్కి, కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని, తద్వారా తన భర్త ఆశయాలను నెరవేర్చే అవకాశాన్ని తనకు ఇవ్వాలని ఆమె ప్రజలను అభ్యర్థించారు.
జూబ్లీహిల్స్ ప్రజలకు నా విన్నపం..
కుటంబ పెద్దను కోల్పోయి, పుట్టెడు దు:ఖంలో ఉన్నప్పటికీ ..
మమ్మల్నే నమ్ముకున్న ప్రజలకు అండగా నిలబడాలనే ఉద్దేశ్యంతోనే
కేసీఆర్ గారి ఆశీస్సులతో జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్నాను.ఎన్ని ఆటంకాలు ఎదురైనా మొండి ధైర్యంతో ముందుకెళ్తున్న మీ ఆడబిడ్డను… pic.twitter.com/i6mF3p0jjM
— Maganti Sunitha Gopinath (@magantigopimla) November 10, 2025