Telangana News: బీసీ రిజర్వేషన్ల అంశంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.
బీసీ రిజర్వేషన్ల అంశం.. మళ్లీ హైకోర్టుకే?
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఇటీవలహైకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీని దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనిపై గురువారం ఉదయం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. జీవో నెంబరు-9 పై హైకోర్టు స్టే విధించడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయని కోర్టు దృష్టికి తెచ్చారు అడ్వకేట్. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం సర్వే చేసిందన్నారు. దాని ఆధారంగా అసెంబ్లీలో బిల్లు పెట్టిందని వివరించారు. ఈ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లును పెండింగ్‌లో పెట్టారని తెలిపారు.
ఎస్ఎల్‌పీ పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరణ
గవర్నర్- రాష్ట్రపతి వద్ద మూడు నెలల పాటు బిల్లు పెండింగ్‌లో ఉంటే ఆమోదం పొందినట్టే అవుతుందని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఈ సందర్భంగా ప్రస్తావించారు. బిల్లును ఛాలెంజ్ చేయకుండా, బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను సవాల్ చేశారని త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు అభిషేక్ మనుసింఘ్వీ.
సుప్రీంకోర్టు విధించిన కండీషన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని, డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపి, డేటా కూడా సేకరించిందన్నారు. ఈ వివరాలు ఆధారంగానే బిల్లు తీసుకొచ్చిందన్నారు. దీనిపై తీర్పు ఇచ్చే ముందు తమ వాదనలు వినాలని ముగ్గురు వ్యక్తులు కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. వారి తరపున సీనియర్ న్యాయవాది గోపాల్ వాదనలు వినిపించారు.
ALSO READ: మీనాక్షి నటరాజన్ వద్దకు కొండా సురేఖ
రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దానికి విరుద్ధంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని వాదించారు. షెడ్యూల్ ఏరియా, గిరిజన ప్రాంతాల్లో 50 శాతానికి మించిన రిజర్వేషన్లు పెంచుకునే అనుమతి ఉందన్నారు. జనరల్ ఏరియాల్లో 50 శాతానికి మించి పెంచడానికి వీల్లేదని పేర్కొన్నారు.
గతంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఇలాంటి ప్రస్తావన వచ్చినప్పుడు న్యాయస్థానాలు తిరస్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని కొట్టివేసింది. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత మళ్లీ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
BREAKING
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు
పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించిన సుప్రీం
బీసీ రిజర్వేషన్లపై ఎస్‌ఎల్‌పీని తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో ఎస్‌ఎల్‌పీని దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం https://t.co/zKewTriVeE
— BIG TV Breaking News (@bigtvtelugu) October 16, 2025