సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అనే పేరుతో కర్నూలులో సభ జరిగినా.. జీఎస్టీ గురించి ప్రధాని మోదీ పెద్దగా ప్రస్తావించలేదు. తమ హయాంలో జరిగిన అభివృద్ధినంతా ఆయన ఏకరువు పెట్టారు. అదే సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఆయన పలుమార్లు ప్రశంసించారు. ఏపీలో చంద్రబాబు- పవన్ కల్యాణ్ రూపంలో శక్తిమంతమైన నాయకత్వం ఉందని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి పథంలో ఏపీ దూసుకెళ్తోందన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
కర్నూలులో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ https://t.co/lMvFZVOeRc
— Telugu Desam Party (@JaiTDP) October 16, 2025
నాకు ఆ అదృష్టం దక్కింది..
భారత్ లోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమ్ నాథ్ ఆలయం ఉన్న గుజరాత్ తన జన్మస్థానం అని, శ్రీశైలంలో ఉన్న రెండో జ్యోతిర్లింగమైన శ్రీశైల మల్లికార్జునుడిని నేడు తాను దర్శించుకున్నానని తెలిపారు మోదీ. కాశీ విశ్వేశ్వరుడి క్షేత్రానికి సేవ చేసే భాగ్యం కూడా ఆ ప్రాంత ఎంపీగా తనకు లభించిందని గుర్తు చేశారు. శ్రీశైలంలో ఛత్రపతి శివాజీ ధ్యాన మందిరాన్ని దర్శించానని తెలిపారాయన.
కర్నూలు గొప్పదనం..
కర్నూలు సభలో ఆ ప్రాంత గొప్పదనాన్ని విశదీకరించారు మోదీ. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి లాంటి ధీరులకు వినమ్రపూర్వక నమస్కారం అని తెలిపారు. కర్నూలుని ఏపీ ప్రభుత్వం డ్రోన్ హబ్ గా మార్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఆపరేషన్ సిందూర్ లో డ్రోన్ల సామర్థ్యం ఏంటో ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసొచ్చిందన్నారాయన. డ్రోన్ హబ్ గా కర్నూలు దేశంలోనే ప్రముఖ స్థానం సంపాదిస్తుందన్నారు.
గూగుల్ ఏఐ సెంటర్..
గూగుల్ సంస్థకు అమెరికా బయట ఉన్న అతి పెద్ద పెట్టుబడి కేంద్రం ఏపీ అని తెలిపారు మోదీ. వైజాగ్ లో ఏర్పాటు చేయబోతున్న గూగుల్ ఏఐ సెంటర్ తో రాష్ట్ర ఐటీ గతి మారిపోతుందని తెలిపారు. విశాఖలో ఏర్పాటు చేసే ఏఐ హబ్ లో ఏఐ ఇన్ ఫ్రా స్ట్రక్చర్, డేటా సెంటర్ సామర్థ్యం, ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్ లు ఉంటాయని అన్నారు. నిమ్మలూరులో అడ్వాన్స్డ్ నైట్ విజన్ ఫ్యాక్టరీ ప్రారంభించుకుంటున్నామని, దేశ రక్షణ రంగంలో ఆత్మనిర్భరతకు ఇది ప్రతిరూపం అన్నారు. క్షిపణుల కోసం సెన్సార్లు, నైట్ విజన్ పరికరాలు ఇక్కడ తయారవుతాయని చెప్పారు. ఈ పరికరాలు భారత దేశ రక్షణ రంగ ఎగుమతులను మరింత పెంచుతాయన్నారు.
Also Read: ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలు దేశానికి గేమ్ ఛేంజర్లు: సీఎం చంద్రబాబు
వికసిత్ భారత్..
స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి వికసిత్ భారత్ కలను సాకారం చేస్తామన్నారు మోదీ. 21 వ శతాబ్దం భారత దేశానిదని, 140 కోట్ల మంది భారతీయులది అని చెప్పారు. నేడు విద్యుత్, రైల్వే, జాతీయ రహదారులు, రక్షణ రంగాలకు చెందిన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రంలో కనెక్టివిటి బలోపేతం కావడంతో పాటు పరిశ్రమలు కూడా బలోపేతం అవుతాయన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్లాక్ అవుట్ లాంటి విద్యుత్ సంక్షోభాలు వచ్చాయని, అప్పట్లో తలసరి విద్యుత్ వినియోగం 1000 యూనిట్ల కంటే తక్కువగా ఉండేదని మోదీ గుర్తు చేశారు. చాలా గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు కూడా లేని పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు క్లీన్ ఎనర్జీ నుంచి మన అవసరాలకు తగినంత ఉత్పత్తి చేసుకుంటున్నామని, తలసరి విద్యుత్ వినియోగం, 1400 యూనిట్లకు పెరిగిందన్నారు.
Also Read: సభలో పవన్ కళ్యాణ్.. గూస్ బంప్స్ స్పీచ్..