Konda Surekha: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. మంత్రి కొండా సురేఖ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. అయితే.. రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముందు ఈ చర్చ జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మంత్రి సురేఖ తన వ్యక్తిగత వాహనంలో ఎలాంటి అధికారిక భద్రత లేకుండానే భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లారు. ఇద్దరి మధ్య భేటీ ఇంకా కొనసాగుతోంది.
కేబినెట్ గైర్జాజరు.. కారణమిదే..?
అంతకు ముందు కొండా సురేఖ నేడు జరగనున్న రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. మంత్రి కొండా సురేఖకు ఓఎస్డీగా పని చేసిన ఎన్. సుమంత్‌కు సంబంధించిన వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కొండా సురేఖ కేబినెట్ సమావేశానికి గైర్హాజరు కావడం వెనుక ఈ వివాదమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మీడియా ముందుకు వెళ్లొద్దు.. మీనాక్షి నటరాజన సూచన
అయితే.. అంతకు ముందుకు కొండా సురేఖతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్‌లో సంభాషించారు. ఎట్టి పరిస్థితుల్లో మీడియా ముందుకు వెళ్లొద్దని కొండా సురేఖకు కీలక సూచనలు ఇచ్చారు. కూర్చొని మాట్లాడితే సమస్యలు పరిష్కారం అయితాయని మీనాక్షి నటరాజన్ చెప్పినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించిన విషయం తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సిమెంటు కంపెనీల యాజమాన్యాలను ఆయన బెదిరించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఈ విషయంపై ప్రభుత్వం గట్టిగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మంత్రి సురేఖ ఇంటికి పోలీసులు..
ఈ పరిణామాల నేపథ్యంలోనే.. హైదరాబాద్‌లో మంత్రి కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లారు. మంత్రి ఇంట్లో ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్ ఉన్నారన్న సమాచారంతో పోలీసులుకు అక్కడకు వెళ్లారు. అయితే.. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత వారిని నిలదీశారు. తమపై బురదజల్లేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఇవన్నీ చేయిస్తున్నారని సుస్మితా సంచలన ఆరోపణలు చేశారు. తన పేరెంట్స్ ను లక్ష్యంగా చేసుకుని కొందరు కుట్రలు పన్నుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల అన్నింటి నేపథ్యంలోనే కొండా సురేఖతో మీనాక్షి నటరాజన్ మాట్లాడినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని ఇంతటితో క్లోజ్ చేస్తే మంచిదని ఆమె చెప్పినట్లు సమాచారం.
ALSO READ: NMMS: విద్యార్థులకు అద్భుతమైన అవకాశం.. రూ.48,000 స్కాలర్‌షిప్ గడువు పొడగింపు, ఇంకెందుకు ఆలస్యం