Jubilee Hills Bypoll: తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి తారాస్థాయికి చేరిందా? పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారా? ఇప్పటికే బీఆర్ఎస్.. అధికార కాంగ్రెస్-బీజేపీలను టార్గెట్ చేసింది. బీజేపీ కూడా రంగంలోకి దిగేసింది. ఆ మూడు పార్టీలు ఒక్కటేనని ప్రచారం మొదలుపెట్టింది.
జూబ్లీహిల్స్ బైపోల్‌లో మాటల యుద్ధం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఓట్ల చోర్ అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. దీనిపై ఎన్నికల అధికారులు క్లారిటీ ఇచ్చారు. అటు అధికార కాంగ్రెస్ కూడా తనదైన శైలిలో విరుచుపడింది.
దీంతో ఇంకొన్ని అస్త్రాలు ఎక్కుపెట్టేందుకు సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ. బుధవారం బీజేపీ అభ్యర్థిగా లంకాల దీపక్‌రెడ్డిని ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగేసింది. మాటలకు పదును పెట్టారు. తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్-కాంగ్రెస్-ఎంఐఎం పార్టీలకు కుటుంబాలే ముఖ్యమన్నారు.
ఎంఐఎం టార్గెట్‌గా కిషన్‌రెడ్డి కామెంట్స్
తెలంగాణ, జూబ్లీహిల్స్ ప్రజలు ఈ పార్టీలకు ముఖ్యం కాదన్నారు. ఈ మూడు పార్టీలు మజ్లిస్ నాయకత్వంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో జూబ్లీహిల్స్ ఓటర్లు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాతబస్తీలో మజ్లిస్ వ్యవహారశైలి కారణంగా చాలామంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మజ్లీస్ పార్టీ డిసైడ్ చేసిందని, జూబ్లీహిల్స్‌ను మరో పాతబస్తీగా మార్చాలని చూస్తున్నారని విమర్శించారు. ఎంఐఎం కబంధ హస్తాల నుండి హైదరాబాద్‌ను రక్షించుకోవాలన్నారు. మజ్లీస్‌కు అభివృద్ధి అవసరం లేదని, వాళ్లకు కావాల్సింది మత రాజకీయాలేనని అన్నారు.
ALSO READ: ఇన్‌ఛార్జ్ మీనాక్షి వద్దకు మంత్రి కొండా సురేఖ
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడ? దీనిపై ఆ పార్టీని నిలదీయాల్సిన అవసరం వచ్చిందన్నారు. మనకు మజ్లిస్ చేతిలో కీలుబొమ్మలాంటి వ్యక్తి కావాలా? జూబ్లీహిల్స్‌లో ఎవరు గెలిస్తే బాగుంటుందో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా పలికే వ్యక్తి దీపక్‌రెడ్డి అని, ఆయన్ని గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు కుటుంబాలే ముఖ్యం: కిషన్ రెడ్డి
తెలంగాణ, జూబ్లీహిల్స్ ప్రజలు ఈ పార్టీలకు ముఖ్యం కాదు
ఈ మూడు పార్టీలు మజ్లిస్ నాయకత్వంలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాయి
అందుకే ఈ విషయంలో జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది
– కేంద్ర మంత్రి… pic.twitter.com/vbXSIEg3gH
— BIG TV Breaking News (@bigtvtelugu) October 16, 2025