జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల్ని బరిలో దింపాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు తనదేనంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సింపతీ ఓట్లతో నెగ్గాలని చూస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి గా బరిలో దిగిన లంకాల దీపక్ రెడ్డి కూడా ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. స్వతంత్రులు కూడా 20మందికి పైగా ఇప్పటికే నామినేషన్లు వేశారు. వారి సంగతి పక్కనపెడితే ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యే ఉంటుంది. అందులో కూడా బీజేపీని పక్కనపెడితే పోరు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే అని స్పష్టమైంది.
టీడీపీ మద్దతు ఎవరికి?
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారి అక్కడ 2009లో కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్దన్ రెడ్డి విజయకేతనం ఎగుర వేశారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ గెలిచారు. అయితే ఆయన ఆ తర్వాత పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ లో చేరారు. 2018, 2023లో వరుసగా మరో రెండుసార్లు బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనిపించుకున్నారు. ఆయన అకాల మరణంతో ఉప ఎన్నికలొచ్చాయి. ఈ ఎన్నికల్లో మాగంటి కుటుంబానికి మరోసారి ఓటర్లు అవకాశమిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. అయితే ఇక్కడ ఇప్పటి వరకూ టీడీపీ కేడర్ అంతా మాగంటి గోపీనాథ్ తోనే ఉంది. ఈసారి టీడీపీ ఓట్లు ఏపార్టీకి పడతాయో చూడాలి. 2014లో టీడీపీ అభ్యర్థిగా గోపీనాథ్ గెలిచారు. ఆ తర్వాత ఆయన పార్టీ మారినా కేడర్ కూడా ఆయనపై నమ్మకంతో ఆయన వెంటే నడిచింది. జూబ్లీహిల్స్ లో సెటిలర్ల ఓట్లన్నీ బీఆర్ఎస్ లో చేరినా కూడా మాగంటికే పడేవి. ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ఈసారి సెటిలర్ల ఓట్లపై టీడీపీ ప్రభావం గట్టిగా ఉండే అవకాశముంది. దీంతో టీడీపీ కేడర్ ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు.
Also Read: నారాయణపై నాదెండ్ల సీరియస్
టీడీపీ వైఖరి ఏంటి?
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. టెక్నికల్ గా ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉన్నా కూడా బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ పార్టీ అధినేత కానీ, ఇతర నేతలు కానీ ప్రకటించలేదు. అంటే కేడర్ పై వారు ఒత్తిడి తేవడం లేదన్నమాట. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకి పరోక్షంగా టీడీపీ ఓటుబ్యాంక్ సహాయపడిందనే ప్రచారం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి టీడీపీ నేతలతో సత్సంబంధాలున్నాయి. దీంతో ఆయన గెలుపుకోసం టీడీపీ కేడర్ కూడా పనిచేసిందని అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ కేడర్ కాంగ్రెస్ కి అనుకూలంగా పనిచేస్తుందని అంటున్నారు. ఇటీవల ఎంఐఎం కూడా కాంగ్రెస్ కి మద్దతుగా మాట్లాడింది. కాంగ్రెస్ మినహా తెలంగాణను, ముఖ్యంగా పాతబస్తీని ఇతర పార్టీలు అభివృద్ధి చేయలేదని అన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్. సో.. కాంగ్రెస్ కి ఊహించని మద్దతు లభించినట్టయింది. ఇటు మాగంటి కుటుంబం సెంటిమెంట్ అస్త్రం ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. టీడీపీ కేడర్ కూడా కాంగ్రెస్ కే మద్దతిస్తే నవీన్ యాదవ్ గెలుపు నల్లేరుపై నడక అవుతుంది.
Also Read: విశాఖకు గూగుల్.. జగన్ కు మాటల్లేవ్