Supreme Court: స్వేచ్చ బ్యూరో: సీబీఎస్ఈ సిలబస్లో మూడో భాష ఎందుకంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. 9వ తరగతిలో మూడు భాషలు తీసుకు రావటం వల్ల విద్యార్థులపై అనవసర ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయ పడింది. సీబీఎస్ఈ బోర్డు ఎడ్యుకేషన్ లో 9వ తరగతిలో మూడు భాషలను ప్రవేశ పెట్టటంపై దాఖలైన వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీ.వీ.నాగరత్న, జస్టిస్ ఆర్.మహదేవన్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.
నవోదయ పాఠశాలల్లో మూడు భాషలను నేర్పించే విధానం ఉంటుంది. దీనివల్ల రాష్ట్రంలో హిందీ భాషను బలవంతంగా పిల్లలపై రుద్దుతారని భావించిన తమిళనాడు ప్రభుత్వం ఈ స్కూళ్ల ఏర్పాటును ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాంతోపాటు ఇదే అంశానికి సంబంధించి మరికొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. తమిళనాడు తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 9వ తరగతి నుంచి మూడో భాష తప్పనిసరి అవుతుందని చెప్పారు. దీనిపై జస్టిస్ నాగరత్న స్పందిస్తూ ఇది చాలా పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు. 9వ తరగతి అనేది విద్యార్థులకు ఎంతో ఒత్తిడితో కూడుకున్న సమయమన్నారు. ఆ సమయంలో కొత్త భాషను ఎందుకు పరిచయం చేయటం అని అన్నారు. ఏవైనా కొత్త భాషలు చెప్పాలంటే వాటిని 6వ తరగతి నుంచే మొదలు పెట్టాలి కదా అని వ్యాఖ్యానించారు.
Also read: వన్‌ప్లస్ సంచలనం.. అమెరికా, యూరప్ మార్కెట్లకు గుడ్ బై.. మరి భారత్ సంగతేంటి?
ఇక, మూడు భాషల విధానంలో హిందీని ఖచ్చితంగా నేర్చుకోవాలని ఎక్కడా లేదు అని జస్టిస్ నాగరత్నం అన్నారు. రాష్ట్ర భాష అయిన తమిళం, ఇంగ్లీష్ తోపాటు మూడో భాష ఏదైనా చదువుకోవచ్చన్నారు. జాతీయ విద్యా విధానం ప్రకారం ఏ రాష్ట్రంపైనా ఏ భాషనూ బలవంతంగా రుద్దకూడదని న్యాయవాది చెప్పగా మీకు హిందీ వద్దు మరి సంస్కృతం నేర్చుకుంటే తప్పేంటి? అని ప్రశ్నించారు. తన సొంత స్కూల్ రోజులను గుర్తు చేస్తూ మా చిన్నపుడు ఎస్ఎస్ఎల్సీ పరీక్షల కోసం 6వ తరగతి నుంచే మూడో భాషను నేర్పించేవారని చెప్పారు. కొత్త భాషలను ఎంత త్వరగా నేర్చుకోవటం ప్రారంభిస్తే అంత మంచిదన్నారు.
9వ తరగతిలో మూడో భాషను తీసుకురావద్దని చెప్పారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ లేదా రాష్ట్ర బోర్డులైనా సరే 10వ తరగతి అన్నది బోర్డు పరీక్ష అని గుర్తుంచుకోవాలన్నారు. 10వ తరగతి పరీక్షల టెన్షన్ విద్యార్థులకు 8వ తరగతి నుంచే మొదలవుతుందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 9వ తరగతిలో మూడో భాష నేర్పించటం మొదలు పెడితే విద్యార్థులు మరింత ఆందోళన, ఒత్తిడికి గురవుతారన్నారు. ఇక, ఒకే ఒక్క కారణంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నవోదయ పాఠశాలలను అడ్డుకోవద్దని తమిళనాడు ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుతం తమిళనాడులో నవోదయ పాఠశాలల ఏర్పాటుపై కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. చర్చలు విఫలమైతే కోర్టు తన తుది నిర్ణయం వినిపిస్తుందన్నారు. నవోదయ స్కూళ్ల ఏర్పాటుకు స్థలాలు కేటాయించేందుకు మరికొంత సమయం కావాలని తమిళనాడు ప్రభుత్వ తరపు న్యాయవాది కోరటంతో సుప్రీం కోర్టు ఆరు వారాల సమయం ఇచ్చింది.
Also read: Kalvakuntla Kavitha: డ్రామాలొద్దు.. కాంగ్రెస్ సర్కార్ పై కల్వకుంట్ల కవిత ఫైర్!