
Telangana Elections | తెలంగాణలో నామినేషన్లు విత్ డ్రా చేసుకునే గడువు బుధవారం ముగిసింది. 608 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల బరిలో అన్ని నియోజకవర్గాలలో కలిపి మొత్తం 2,290 మంది అభ్యర్ధులు ఉన్నారు.
ముఖ్యంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 70 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అయినా గజ్వేల్ నుంచి 44 మంది పోటీలో ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం కామారెడ్డిలో నామినేషన్ల ఉపసంహరణ తరువాత 39 మంది అభ్యర్థులు తుది పోరులో ఉన్నారు.
అందరికన్నా ఎక్కువగా ఎల్‌బీ నగర్ నుంచి 48 మంది పోటీలో నిలిచారు. అలాగే పాలేరులో 37, నాంపల్లిలో 34, కోదాడలో 34, ఖమ్మంలో 32, నల్గొండలో 31, కొత్తగూడెంలో 30 మంది పోటీలో నిలబడ్డారు. నామినేషన్ల ఘట్టం పూర్తవడంతో ఇక ఎన్నికల ప్రచార కార్యక్రమాలు మరింత జోరుగా సాగనున్నాయి. తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 30వ తేదీన పోలింగ్ జరగనుంది. నవంబర్ 28న ప్రచారానికి చివరి తేది. డిసెంబర్ 3న ఓట్ల ఫలితాలు వెలువడుతాయి.