
Telangana Elections | తెలంగాణలో కాంగ్రెస్ గేలుపే లక్ష్యంగా తన ప్రచార వ్యూహలను మరింత పదును పెడుతోంది. వచ్చే 18 రోజుల అత్యంత ప్రాముఖ్యతగల అంశాంగా భావిస్తోంది.అందులో భాగంగానే అగ్రనేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, 14 రోజులపాటు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేయనున్నారు. ఇప్పటి వరకూ జరిగిన ప్రచారం ఒక ఎత్తైతే… రానున్న 18 రోజులూ మరింత కీలకంకానుంది. ప్రతి నిమిషాన్ని సద్వియోగం చేసుకునే అంశంపై అటు ఢిల్లీ నుంచి సాధారణ కార్యకర్త వరకూ ఫోకస్ పెట్టారు.
అభ్యర్థుల ప్రకటన, నామినేషన్ల పర్వం పూర్తికావడంతో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రచారజోరు పెంచింది. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్కా అంటున్నారు హస్తం పార్టీ అగ్రనేతలు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్న ఢిల్లీ అధిష్టానం.. ఎలాగైనా విజయం సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది.
రానున్న రోజుల్లో ప్రచారాన్ని హోరెత్తించడంపై ఏఐసీసీ అధ్యక్షులు, సెక్రటరీ సహా సీనియర్ నేతలు తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ.. ఈ నెల 15 నుంచి తెలంగాణ కేంద్రంగా పర్యటించనున్నారు. ఇప్పటికే ముడు రాష్ట్రల ఎన్నికల ప్రచారం ముగియడంతో.. ఇక.. తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ చేయనున్నారు. కర్ణాటక సహా పలు రాష్ట్రాల సీఎంలు, సీనియర్ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటారు. ఇప్పటివరకూ జరిగిన ప్రచారం, చేసిన ప్రయత్నాలు ఒక ఎత్తు అయితే.. రానున్న 18 రోజుల పాటు జరగనున్న ప్రచారం, చేయాల్సిన క్యాంపెయిన్, ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడాన్ని మరో ఎత్తుగా పార్టీ భావిస్తోంది. ఇందుకోసం నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడంపై కీలకమైన సమావేశాలపై చర్చలు చేస్తోంది కాంగ్రెస్.
ఢిల్లీ నుంచి సోనియా, రాహుల్ సహా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. ఎప్పటికప్పుడు జూమ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వర్కింగ్ కమిటీ సభ్యులు, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు, పీసీసీ చీఫ్ సహా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క మరికొంతరు రాష్ట్ర సీనియర్ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రచార క్యాంపెయిన్, అగ్రనేతల పర్యటనలు, ఏకకాలంలో పలువురు నేతలతో బహిరంగసభలు.. ఇలా..అనేక అంశాలపై లోతుగా ఎప్పటికప్పుడు చర్చిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం.
ఇప్పటి వరకూ కాంగ్రెస్ వ్యూహాలు సక్సెస్‌ఫుల్ అయ్యాయి. ఇవి..రానున్న రోజులు మరింత కీలకంకానున్నాయి. ముఖ్యంగా పేదల కోసం ప్రకటించిన ఆరు గ్యారంటీ పధకాలు, మేనిఫెస్టోపైనే అగ్రనేతలు దృష్టి సారించారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని తామే ఏర్పాటు చేశామనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లాలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో పాటు కేసీఆర్ వ్యవహారం, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా కసరత్తులు చేస్తున్నారు. అవకాశమున్న చోట కేసీఆర్‌పై నేతలు.. తీవ్రస్థాయిలోనే విమర్శలు చేస్తూ.. ప్రసంగాలతో కాంగ్రెస్ శ్రేణులు, హస్తం కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో మొదలుపెట్టిన యాక్షన్ ఇప్పటివరకూ ఆశించిన ఫలితాలనే ఇచ్చిందని కాంగ్రెస్ భావిస్తోంది. రానున్న రోజుల్లో నేతలు.. మరింత పట్టుదలతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తచేస్తోంది.రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ.. ఈ నెల 15 నుంచి 28 వరకూ రాష్ట్రంలోనే పర్యటించే అంశంతో పాటు పీసీసీ నేతలతో పాటు ఇతర రాష్ట్రాల సీనియర్ నేతలు కూడా వస్తున్నందున వీటన్నింటి మధ్య పటిష్టమైన సమన్వయం చేసుకుంటు ప్రచారంలో భాగస్వాములు కావాలని జూమ్ మీటింగ్ ద్వారా అగ్రనేత సోనియాగాంధీ సూచలు చేశారు.
హైదరాబాద్ తుక్కుగూడ విజయభేరి వేదికగా సెప్టెంబరు 17న సోనియాగాంధీ ప్రకటించని ఆరు గ్యారంటీలతో ప్రజల్లో.. పార్టీ పట్ల కాన్ఫిడెన్స్ పెంచిందని, కర్ణాటకలో అమలవుతున్న స్కీమ్‌లు తెలంగాణ ప్రజలకు భరోసా కల్గించాయని సోనియా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ రూపొందించుకోవాలని అగ్రనేతలు సూచిస్తున్నారు. మేనిఫెస్టోలోని హామీలను తూచా తప్పకుండా అమలు చేయడంపై ప్రజలకు నొక్కిచెప్పడంపైనా నిర్దిష్టమైన సూచనలు చేస్తున్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలపై ఇప్పటికే ప్రజల్లో స్పష్టమైన అవగాహన ఉన్నదని, దానికి దారితీసిన పరిస్థితులను, ఆ కారణంగా పడుతున్న బాధలను వివరించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చూపే పరిష్కారాలను వివరించే ప్రయత్నం చేయాలని హైకమాండ్ నిర్దేశిస్తోంది. ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కి కేసీఆర్ ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలతో పాటు ఆయన కుటుంబ అవినీతిని జనంలోకి బలంగా తీసుకువెళ్లనున్నారు. ప్రజలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు మొదలు ముఖ్యమంత్రి వరకు ఇష్టారీతిలో వ్యవహరించడం, ప్రజల బాధలను పట్టించుకునే వ్యవస్థ లేకపోవడం.. వీటన్నింటినీ ప్రజలకు వివరించాలని సూచిస్తున్నారు. ఒక్కో వైఫల్యాన్ని ప్రజలకు అర్థమయ్యే తీరులో చెప్పటంతో పాటు అనుగుణమైన కార్యాచరణ ఎంచుకోవాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది.
సుమారు మూడు వారాల పాటు జరిగే ఎన్నికల క్యాంపెయిన్‌లో ప్రజలకు మరింత దగ్గర కావడంపై వీలైనన్ని రూపాల్లో ప్రజలకు చేరువకావడంపై అధిష్టానం దృష్టి సారించింది. పార్టీపైన నమ్మకాన్ని ఏర్పర్చడం, బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలోని వైఫల్యాలను, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించటం సహా మంచి రోజులు రానున్నాయనే నమ్మకాన్ని కలిగించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు, ఆశలను సాకారం చేసుకునే సమయం ఆసన్నమైందనే హామీతో పాటు వారి భాగస్వామ్యాన్ని తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.