ఏపీకి పెట్టుబడుల సాధన కోసం సీఎం చంద్రబాబు సహా మంత్రులు కూడా విదేశీ పర్యటనలకు వెళ్లొస్తున్నారు. విశాఖ CII పార్ట్ నర్ షిప్ సమ్మిట్ విజయవంతం కోసం ఇటీవల ఐటీ మంత్రి నారా లోకేష్, MSME మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ సహా ఇతర కూటమి మంత్రులు విదేశాలకు వెళ్లి వచ్చారు. తాజాగా మంత్రి నారాయణ మూడు రోజుల దుబాయ్ పర్యటన పూర్తయింది. ఇంతకీ నారాయణ పర్యటన ద్వారా ఏపీకి ఏయే కంపెనీలు వచ్చే అవకాశముంది, వాటి వల్ల రాష్ట్రానికి కలిగే ఉపయోగం ఏంటి?
లాజిస్టిక్స్ హబ్ గా ఏపీ..
ఈనెల 14, 15 తేదీల్లో విశాఖ కేంద్రంగా CII పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరగాల్సి ఉంది. ఈ సమ్మిట్ లో పాల్గొని, ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వివిధ విదేశీ కంపెనీలను ఏపీ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఆహ్వానాలను నేరుగా అందించేందుకు విదేశీ పర్యటనలకు వెళ్లొస్తున్నారు నేతలు. తాజాగా మంత్రి నారాయణ బృందం దుబాయ్ లో పర్యటించింది. ఈ సమావేశాల్లో భాగంగా ఏపీలో మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు శోభా రియాల్టీ గ్రూప్ ముందుకు రావడం విశేషం. ఫ్యాషన్, ఫుట్ వేర్ రంగాల్లో 14 దేశాల్లో ప్రసిద్ధి పొందిన అపరెల్ గ్రూప్ చైర్మన్ నీలేష్ వేద్ తో మంత్రి నారాయణ సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. షిప్పింగ్,లాజిస్టిక్స్ రంగంలో దుబాయ్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ తో కూడా ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేష్ రామకృష్ణన్ సుముఖత వ్యక్తం చేశారు.
As part of my third-day visit to Dubai, I met representatives of #BEEAH Facility Company, a global leader in #wastemanagement and recovery systems, at the Sharjah Chamber in Dubai. The company representatives gave a presentation on waste collection and management practices in the… pic.twitter.com/iMlaP0Gm9W
— Ponguru Narayana (@Dr_NarayanaP) November 5, 2025
సరికొత్త కూలింగ్ సిస్టమ్..
వేడిని తగ్గించేందుకు ఏసీలకు బదులు అండర్ గ్రౌండ్ పైప్ నెట్ వర్క్ ద్వారా కూలింగ్ వాటర్ ను తీసుకెళ్లే డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు దుబాయ్ లో బాగా ఫేమస్. ఆ రంగంలో తబ్రీద్ కంపెనీ దూసుకుపోతోంది. బుర్జ్ ఖలీపా, దుబాయ్ మాల్ వంటి వాటికి తబ్రీద్ కంపెనీ డిస్ట్రిక్ట్ కూలింగ్ సేవలను అందిస్తుంది. ఆ కంపెనీ ప్రతినిధులతో మంత్రి నారాయణ భేటీ అయ్యారు. అమరావతితోపాటు ఇతర ప్రాంతాల్లో డిస్ట్రిక్ట్ కూలింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు వారిని ఆహ్వానించారు.
దుబాయ్ లోని షార్జా చాంబర్ లో వేస్ట్ మేనేజ్ మెంట్, రికవరీ ప్లాంట్ ల ఏర్పాటుతో పాటు వైద్య రంగంలో ప్రపంచ ప్రసిద్ది పొందింది బీఆ(BEEAH)ఫెసిలిటీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న మున్సిపాల్టీల్లో ఈ సంస్థ చెత్తను సేకరించి ప్రాసెస్ చేస్తుంది. ఏపీలో కూడా మున్సిపాల్టీలను చెత్త రహితంగా మార్చే ప్రణాళికను వారికి వివరించిన మంత్రి, రాష్ట్రంలో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ల ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. విద్యుత్, ఆయిల్, గ్యాస్ తో పాటు భారీ నిర్మాణాల ప్రాజెక్ట్ ల్లో 22 ఏళ్ల అనుభవం ఉన్న టెక్టాన్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి, అమరావతి నిర్మాణంలో పలు ప్రాజెక్ట్ లుల్లో భాగస్వామ్యం కావాలని వారిని కోరారు. ఈ సంస్థ రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ల నిర్మాణంలో వివిధ దేశాల్లో అనేక ప్రాజెక్ట్ లు చేపట్టింది. అజ్మాన్ లో టెక్టాన్ ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీతో కూడా సమావేశం జరిగింది. మైనింగ్,వి ద్యుత్, షిప్ బిల్డింగ్, ఇన్ లాండ్ వాటర్ వేస్, ఏవియేషన్ ప్రాజెక్ట్స్ లో ప్రపంచ ప్రసిద్దిగాంచిన కార్బొనాటిక్ సంస్థ ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. ఏపీలో నౌకల నిర్మాణం, ఏవియేషన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కార్బోనాటిక్ సంస్థ ఆసక్తి కనబరచడం విశేషం.
మంత్రి నారాయణ బృందం దుబాయ్ పర్యటన విజయవంతమైందని, పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాయని, రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకొచ్చాయని ప్రభుత్వం చెబుతోంది. దుబాయ్ కంపెనీలు CII పార్ట్ నర్ షిప్ సమ్మిట్ లో పాల్గొని మరిన్ని పెట్టుబడులకు అంగీకారం తెలిపే అవకాశం ఉంది.
Also Read: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: తప్పులో కాలేసిన వైసీపీ సోషల్ మీడియా..