Road Accident: బాపట్ల పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గడియార స్తంభం సమీపంలో వేగంగా వస్తున్న ద్విచక్రవానం.. లారీని ఢీకొని స్పాట్ లోనే ఇద్దరు యువకులు ప్రాణాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన షేక్ రిజ్వాన్, చింతల నాని అనే ఇద్దరు యువకులు సూర్యలంక బీచ్‌కు వెళ్లారు. అక్కడ బీచ్ మూసివేయడంతో తిరిగి గుంటూరుకి బయల్దేరారు. ఈ నేపథ్యంలో చీరాల నుంచి గుంటూరు వైపు వెళుతున్న లారీ వెనక భాగాన్ని ద్విచక్ర వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో బైక్ పూర్తిగా నుజ్జునుజ్జయింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరూ గాల్లోకి ఎగిరి రోడ్డు పక్కకు పడిపోవడంతో తీవ్ర గాయాలపాలై స్పాట్‌లోనే మృతి చెందారు. ప్రమాదం జరిగే సమయానికి రోడ్డుపై వాహన రాకపోకలు తక్కువగా ఉన్నందువల్ల, ప్రమాదం ఒక్కసారిగా జరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి స్థానికులు పరుగెత్తి వచ్చి బాధితులను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే వారు మృతిచెందారని గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.
సీసీ కెమరా ఫుటేజ్‌లో బైక్ వేగంగా వస్తూ లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులు ఆ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. అధిక వేగమే ఈ ప్రమాదానికి కారణమని, బైక్‌పై ఉన్న యువకులు హెల్మెట్ ధరించకపోవడం కూడా ప్రమాద తీవ్రతను మరింత పెంచిందని ప్రాథమిక విచారణలో తేలింది.
Also Read: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా, లేక బైక్ వేగమే కారణమా అనే అంశంపై సీసీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు.