Telangana Elections : నామినేషన్ వేసేందుకు వచ్చిన యువకుడిని అడ్డుకున్న పోలీసులు.. అతనేం చేశాడంటే?
Telangana Elections : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. నామినేషన్ల పర్వం మొదలైంది. ఎన్నికలు అనగానే ఓట్ల కోసం వచ్చే నేతల వద్ద కొందరు తమ డిమాండ్లను పెట్టి సాధించుకుంటారు. కొన్ని సందర్భాల్లో సమస్యలపై నిరసనను కూడా వ్యక్తం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి వినూత్నంగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక యువకుడు వినూత్నంగా నిరసన తెలిపారు. అతడు ఎన్నికల నామినేషన్ వేసేందుకు గాడిదతో వచ్చాడు. అయితే అతడిని పోలీసులు అడ్డుకున్నారు. గాడిదని లోపలికి అనుమతించేది లేదని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను నిరసిస్తూ అతను నామినేషన్ వేయడానికి ఇలా వచ్చానని ఆ యువకుడు తెలిపాడు. ఈ ఘటన బాన్సువాడలో జరిగింది.
అలాగే మరో నిరుద్యోగ యువకుడు పుట్ట భాస్కర్ కూడా నామినేషన్ వేసేందుకు చొక్కా లేకుండా లుంగీ, బనియన్ ధరించి.. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చాడు. ఆ యువకుడిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. తరువాత అధికారుల సూచన మేరకు రిటర్నింగ్ కార్యాలయంలో షర్టు వేసుకుని తన నామినేషన్ వేశారు.
అనంతరం నిరుద్యోగి భాస్కర్ మాట్లాడుతూ.. ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, గ్రూపు 2 పరీక్షలు పలుమార్లు వాయిదా పడడంతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువత సమస్యను తెలియచేయడానికే ఇలా నామినేషన్ వేశానని తెలిపాడు. ఈ ఇద్దరు నిరుద్యోగ యువకుల వినూత్న నిరసన గురించి సోషల్ మీడియాలో యువత తెగ షేర్ చేస్తోంది.