KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తారాస్థాయికి చేరింది. అధికార కాంగ్రెస్-బీఆర్ఎస్-బీజేపీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు నేతలు. కాకపోతే టీడీపీ తటస్థంగా ఉండడంతో ఆ ఓట్లపై గురి పెట్టింది బీఆర్ఎస్. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని మరోసారి ప్రస్తావించారు కేటీఆర్.
సీఎం చంద్రబాబు కారుపై కేటీఆర్ వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ బైపోల్‌లో టీడీపీ పోటీ చేయకున్నా ప్రచారం రాజకీయాలు ఆ పార్టీ చుట్టూనే నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల నేతలు టీడీపీ మద్దతుదారులపై గురిపెట్టారు. ఆనాడు పీజేఆర్ చనిపోయినప్పుడు ఏకగ్రీవానికి టీడీపీ అంగీకరించినా, బీఆర్ఎస్ మాత్రం నో చెప్పిందని గుర్తు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. దాని కారణంగా ఈనాడు ఉప ఎన్నిక జరుగుతుందన్నారు.
ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది ముమ్మాటికీ కేసీఆరేనని తేల్చిచెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు బీఆర్ఎస్‌ని బాగానే డ్యామేజ్ చేసింది. దీని నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ కొత్త అస్త్రాన్ని ఎత్తుకుంది. వైసీపీ హయాంలో చంద్రబాబు అరెస్టు విషయాన్ని తెరపైకి తెచ్చింది. టీడీపీ మద్దతుదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్.
చంద్రబాబు అరెస్టు విషయాన్ని ప్రస్తావించిన కేటీఆర్
ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు.. అంబాసిడర్ కారుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఫోటోలు ఎక్స్ వేదికగా షేర్ చేశారు. దీన్ని బీఆర్ఎస్ నేతలు తమకు అను కూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కి టీడీపీ సపోర్టు చేస్తుందని, అందుకే మా పార్టీ గుర్తుతో ఫోటోలు పోస్టు చేశారన్నది ఓ కార్యకర్త ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
దీనిపై ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో నోరు విప్పారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం చంద్రబాబు కారు బాగుందని, వారిని తన అభినందనలు తెలిపారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వలో చంద్రబాబు అరెస్టు విషయాన్ని తెరపైకి తెచ్చారు. రెడ్ హిల్స్ ఫ్యాబ్సీ భవన్‌లో కామెడీ షో జరుగుతుందని అన్నారు.
ALSO READ: నా కొడుకును చంపింది వాళ్లే.. పీఎస్ కు మాగంటి గోపీనాథ్ తల్లి
కార్యక్రమం తర్వాత తాను బయటకు వచ్చి ఎక్స్ వేదికగా రాసుకొచ్చానని, అప్పటికి చంద్రబాబు అరెస్టు అయిన విషయం తనకు తెలీదన్నారు. చంద్రబాబు అరెస్టు అయినప్పుడు తాను నవ్వుతున్నట్లు లింకు చేశారని మనసులోని మాట బయటపెట్టారు. సోషల్ మీడియాలో ఎక్కడెక్కడివో లింకు చేస్తున్నారని అన్నారు. అంబాసిడర్ కారుతో సీఎం చంద్రబాబు దిగిన ఫోటోకు-జూబ్లీహిల్స్ బైపోల్‌కు అస్సలు లింకు లేదన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. మొత్తానికి టీడీపీ మద్దతుదారుల కోపాన్ని ఈ విధంగా తగ్గించే ప్రయత్నం చేశారు. మరి బైపోల్‌లో టీడీపీ మద్దతుదారులు ఎటువైపో చూడాలి.