BC Reservations: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు జారీ చేసిన స్టే ఆర్డర్ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న సంకల్పంతో.. ప్రభుత్వం ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ, బీసీ రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయడానికి తగిన పోరాటం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
శుక్రవారం నాడు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ఈ అంశంపై అత్యంత కీలకమైన జూమ్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్వి తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ప్రభావం, తదుపరి న్యాయపరమైన చర్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బీసీలకు స్థానిక సంస్థల్లో.. 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబర్ 9 జారీ చేసింది. అయితే ఈ జీవోను కొందరు కోర్టులో సవాలు చేయడంతో, హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కేంద్రంగా తీసుకున్న కొత్త నిర్ణయం, బీసీ రిజర్వేషన్ అమలుపై తమ కట్టుబాటును మరోసారి స్పష్టంగా చూపిస్తోంది.
Also Read: కరీంనగర్ జిల్లా బీజేపీలో.. బయటపడ్డ విభేదాలు..
కాగా..ఈ నెల 16న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశంలో.. ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్ట్ టెండర్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. క్యాబినెట్ బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం ఏర్పడిన నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లొచ్చన్న హైకోర్టు ఉత్తర్వులపై సమాలోచనలు జరపనున్నారు.