Janagam District: పురిటి నొప్పులతో బాధ పడుతున్న ఓ గర్భిణికి 108 వాహానం ఆలస్యం అవుతుండగా, ప్రసవం కోసం ఆటోలో తరలిస్తుండగా మార్గమధ్యలోనే పురిటి నొప్పులు అధికం కావడంతో ఆశా వర్కర్లు ప్రసవం చేసి మగబిడ్డ ప్రాణాలు నిలిపారు. మగబిడ్డకు పురుడు పోసి ఆశా వర్కర్లు ఆ బాబు పాలిట దైవాలుగా నిలిచారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం జనగామ జిల్లా లింగాల ఘనపురం నెల్లుట్ల గ్రామంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రానికి చెందిన ఏదునూరి కనకలక్ష్మీ(22)కి ఒక్కసారిగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కనకలక్ష్మీ భర్త ఉపేందర్ 108కు ఫోన్ చేయగా ఆలస్యం అవుతుంది అని ఫోన్ లో సమాధానం ఇచ్చారు. దీంతో కనకలక్ష్మీ బంధువైన శ్రీశైలంకు తన ఆటోలో జనగామ ఎంసీహెచ్‌కు తరలిస్తుండగా ఆటోలోనే పురిటి నొప్పులు ఎక్కువ అయ్యాయి. శ్రీశైలంకు తెలిసిన నెల్లుట్లకు చెందిన ఆశ వర్కర్లకు ఫోన్‌లో సమాచారం అందజేశారు.
ALSO READ: Indian Railways: డిగ్రీ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే ఎక్స్ లెంట్ లైఫ్, భారీ వేతనం
విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఆశా వర్కర్లు చీటూరి అరుణ, కోండ్ర పుష్ప, జెగ్గం ఉమలు నెల్లుట్ల రోడ్డుపైనే ఆటోను ఆపి గర్భిణికి ప్రసవ చర్యలు తీసుకున్నారు. దీంతో ఏదునూరి కనక లక్ష్మీకి మగబిడ్డ జన్మించాడు. తల్లి, బాబు ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే 108కు అక్కడి చేరుకోవడంతో చికిత్స కోసం జనగామ ఎంసీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లకు కనకలక్ష్మీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు ఆశా వర్కర్లను అభినందించారు.
ALSO READ: Innovation Hub: ఈ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు: శ్రీధర్ బాబు
ఈ సందర్భంగా ఆశా వర్కర్ అరుణ మాట్లాడుతూ.. మేము విధులు ముగించుకుని ఇంటికి పోతుండగా, ఆటో డ్రైవర్ ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో రోడ్డు మీదనే ప్రసవం చేయాల్సి వచ్చిందని అన్నారు. ఆటోలోనే కాన్పు చేసిన్పటికి బాబు ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. కాన్పు చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని, ప్రభుత్వం ఇచ్చిన శిక్షణ ఇలా ఉపయోగపడిందని వారు వివరించారు.