Karimnagar BJP: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు తాత్కాలికంగా బ్రేకులు వేసినా, కరీంనగర్ జిల్లా బీజేపీలో మాత్రం రాజకీయ వేడి తగ్గడం లేదు. ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గంలో టికెట్ల కేటాయింపుపై జరుగుతున్న వాగ్వాదం.. పార్టీ అంతర్గత విభేదాలకు మరింత బహిర్గతం చేస్తోంది. మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో బీ ఫార్మ్‌లు ఇచ్చేది నేనే అని బహిరంగంగా ప్రకటించగా, జిల్లా రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకే టికెట్లు ఇస్తామని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అంటున్నారు. ఈ వ్యవహారంలో ఇంతకీ టికెట్లు తమకి వస్తాయా.. రావా అని రెండు వర్గాలు డైలామాలో పడ్డారు.
బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్.. ఉపఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన తర్వాత, ఆ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని బలపరిచారు. కానీ ఇటీవల మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన తర్వాత హుజురాబాద్ ప్రాంతానికి దూరమవడం, పార్టీ కార్యకలాపాల్లో తక్కువగా పాల్గొనడం వలన.. ఆయన అనుచరులు కొంత అసంతృప్తిగా ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల సమయం రావడంతో, హుజురాబాద్ బీజేపీలో మళ్లీ చిచ్చు మొదలైంది. ఈటెల అనుచరులు మన టికెట్లు ఎవరు నిర్ణయిస్తారు? అన్న సందేహంలో ఉండగా, ఈటెల తన మీటింగ్‌లో హుజురాబాద్ ప్రాంతం నా ఆధీనంలోనే ఉంటుంది. టికెట్లు నేనే ఇవ్వబోతున్నాను. ఎవరు ఏం చెప్పినా, నేను రెండు దశాబ్దాలుగా ఇక్కడ నాయకత్వం వహిస్తున్నాను అంటూ స్పష్టంగా ప్రకటించారు.
ఇటీవలి కాలంలో బండిసంజయ్, ఈటెల రాజేందర్ మధ్య విభేదాలు మరింత బలపడ్డాయనే వార్తలు బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఈటెల తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా బండిసంజయ్ అడ్డుకున్నారని భావించడం, ఆ విభేదాలకు మూలం అని అంటున్నారు పార్టీ సీనియర్లు. ప్రస్తుతం బండిసంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగుతుండగా, ఈటెల ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయినా ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ విరోధం కరీంనగర్ జిల్లాలో పార్టీని రెండు వర్గాలుగా విడదీస్తోంది.
ఇప్పుడు తిరిగి హుజురాబాద్‌కి వచ్చిన ఈటెల రాజేందర్.. పార్టీ మీటింగ్‌లో తన అనుచరులని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మళ్ళీ చర్చకి దారి తీసాయి. తాను గతంతో ప్రాతినిధ్యం వహించిన హుజురాబాద్ నియోజకవర్గంలో.. బీఫాం లు ఇచ్చేది తానేనని తన అనుచరులకి భరొసా నిచ్చాడు. తాను హుజురాబాద్‌లో ఇరవై ఏండ్ల నుండి లీడర్ అని తాను కాకపోతే ఎవ్వరూ టికెట్లు ఇస్తారని, ఖచ్చితంగా తానే బీఫాం ఇస్తానని చెప్పారు.
Also Read: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు కరీంనగర్ బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి.. సాయంత్రం సమయంలో ఒక ప్రెస్ నొట్ రీలీజ్ చేసారు.. బీజేపి టికెట్లు, బీఫాంలు ఇచ్చేది వ్యక్తులు కాదని బీజేపీ హై కమాండ్.. రాష్ట్ర, జిల్లా పార్టీ మాత్రమేనని ,ఒక వ్యక్తి చెబితే టికెట్లు ఇచ్చే సంప్రదాయం బీజేపీలో లేదని పనిచేసే వారికే గుర్తింపు అని పెర్కోన్నాడు. ఇప్పుడు ఈటెల వ్యాఖ్యలకి కౌంటర్ రావడంతో హుజురాబాద్ ఈటెల వర్గీయులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తమనాయకుడే నేనే టికెట్లు ఇస్తానంటాడు. పనిచేసే వారికే టికెట్లు అని జిల్లా అధ్యక్షుడు అంటాడు, ఇంతకి తమ పరిస్థితి ఏంటి అని తలలు పట్టుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకి హైకోర్టు బ్రేకులు వేసిన కరీంనగర్ బిజేపి మాటల యుద్దం తారస్థాయికి చేరింది.

Share