Danam Nagender: ఖైరతాబాద్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచి వివాదాల్లో ఉన్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు రూపంలో ఊహించని షాక్ తగిలింది. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ.. దానంపై అనర్హత వేటు వేస్తూ సీజే ధర్మాసనం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
పిటిషనర్ల వాదన ఇదే
బీఆర్‌ఎస్ బీ-ఫామ్‌పై గెలిచిన దానం నాగేందర్, ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఇది స్పష్టమైన ఫిరాయింపుల నిరోధక చట్టం ఉల్లంఘనేనని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విడివిడిగా హైకోర్టును ఆశ్రయించారు.
స్పీకర్ ఉత్తర్వులపై కోర్టు ఆగ్రహం
పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పూర్తి ఆధారాలు సమర్పించినప్పటికీ, సరైన సాక్ష్యాలు లేవంటూ స్పీకర్ ట్రైబ్యునల్ మార్చి 11న దానంపై పిటిషన్లను తోసిపుచ్చింది. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పిటిషనర్లు సీజే ధర్మాసనం వద్ద సవాల్ చేశారు. కేసును సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు, స్పీకర్ నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ దానంపై అనర్హత వేటు వేసింది.
ఖాళీగా ఖైరతాబాద్ స్థానం
హైకోర్టు తీర్పుతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు ధర్మాసనం అసెంబ్లీ స్పీకర్‌తో పాటు ఎన్నికల సంఘానికి (EC) అధికారికంగా సమాచారం అందించింది. ఈ తీర్పుతో రాష్ట్రంలో ఇతర పార్టీ మారిన ఎమ్మెల్యేల భవిష్యత్తుపై కూడా రసవత్తర చర్చ మొదలైంది. ఇకపై దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా లేదా ఉప ఎన్నికకు వెళ్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: పాకిస్థాన్‌లో ఘోరం.. మసీదు వద్ద ఆత్మాహుతి దాడి.. 16 మంది మృతి!