MGNREGA E-KYC: స్వేచ్ఛ బ్యూరో: గ్రామీణ పేదలకు అండగా నిలుస్తున్న ఉపాధి హామీ (వీబీ–జీ రామ్ జీ)పథకంలో కేంద్రం మరో కీలక మార్పు అమల్లోకి తీసుకురాబోతోంది. ఈ పథకంలో పనిచేసే నైపుణ్యం, పాక్షిక నైపుణ్యం కలిగిన కూలీలు (స్కిల్డ్, సెమీ–స్కిల్డ్) ఇకపై వేతనం పొందాలంటే ‘ఈ–కేవైసీ’ తప్పనిసరి అనే నిబంధన అమల్లోకి రానుంది. ఆధార్‌తో ముఖ గుర్తింపు ఆధారిత ఈ–కేవైసీ పూర్తయితేనే వారి పేరున ‘ఈ–మస్టర్’ జారీ అవుతుంది. పని ప్రదేశంలో హాజరు పడుతుంది. కొలతల అనంతరం వారి బ్యాంకు ఖాతాల్లోకి వేతనం నేరుగా జమ (డీబీటీ) అవుతుంది. ఈ నిబంధనను కేంద్రం ఈ నెల 21 నుంచే దేశవ్యాప్తంగా అమలులోకి తెస్తోంది. దీని ఉద్దేశం అసలైన గుర్తింపును నిర్ధారించడం, నకిలీ/డూప్లికేట్ వారిని అరికట్టడం, హాజరు–వేతన చెల్లింపుల్లో పారదర్శకత పెంచేందుకు శ్రీకారం చుట్టింది.
76 వేల మందికి.. 79 మందికే!
రాష్ట్రంలో ఈ-కేవైసీ ప్రక్రియ అమలుపై అధికారిక యంత్రాంగం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 76,659 మంది స్కిల్డ్, సెమీ–స్కిల్డ్ కూలీలు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు కేవలం 79 మందికే ఈ-కేవైసీ పూర్తయినట్లు సమాచారం. ఈ గణాంకాలు అధికార యంత్రాంగం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.ఇంత తక్కువ స్థాయిలో ప్రక్రియ కొనసాగితే 21వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చినప్పుడు భారీ సంఖ్యలో కూలీలు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం, నెట్‌వర్క్ సమస్యలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కొరత వంటి అంశాలు ఈ ప్రక్రియను మరింత క్లిష్టతరం చేసే అవకాశముంది.
16 జిల్లాల్లో ‘బోణీ’ కూడా లేదు
ఈ-కేవైసీ పూర్తి చేయించడంలో 16 జిల్లాల్లో కనీస స్థాయిలో కూడా పురోగతి కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు కేంద్రం డిజిటల్ ధ్రువీకరణకు ప్రాధాన్యం ఇస్తుండగా, మరోవైపు క్షేత్రస్థాయి సిబ్బంది కూలీలను ఈ ప్రక్రియలోకి తీసుకురావడంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వం నిర్ణయించిన గడువు ఒక్కరోజూ మాత్రమే ఉండటం .. పెద్ద సంఖ్యలో కూలీలకు ఈ-కేవైసీ పూర్తి కాకపోవడం వల్ల చివరి నిమిషంలో హడావుడి పెరిగే అవకాశం ఉంది. అప్పటివరకు చర్యలు తీసుకోకపోతే కూలీలపై భారం పడటంతో పాటు అధికార యంత్రాంగంపైనా ఒత్తిడి పెరగనుంది.
ఈ-మస్టర్‌కూ కేవైసీ ముడి
కొత్త విధానంలో ఈ-కేవైసీ కీలకంగా మారనుంది. ప్రోగ్రామ్ ఆఫీసర్ (పీవో) లాగిన్‌లో ఈ–మస్టర్ జనరేట్ కావాలంటే కూలీకి ఈ–కేవైసీ తప్పనిసరి. స్కిల్డ్, సెమీ–స్కిల్డ్ లేబర్ వివరాలు ధ్రువీకరణ కాకపోతే ఈ-మస్టర్ జారీ, హాజరు నమోదు, తదనంతర వేతన ప్రక్రియపై ప్రభావం పడే అవకాశం ఉంది.కేవైసీ లేనివారి పేర్లను సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా తిరస్కరిస్తుంది. దీంతో పని చేయడానికి సిద్ధంగా ఉన్న కూలీకి ముందుగా డిజిటల్ ధ్రువీకరణ పూర్తిచేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.ఇప్పటికే ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలులో ఎన్ఎంఎంఎస్ ఆధారిత హాజరు నమోదు వ్యవస్థ కొనసాగుతోంది. కూలీల హాజరును మరింత పారదర్శకంగా నమోదు చేయడమే దీని ఉద్దేశం. అయితేకొత్త విధానంలో ముఖ గుర్తింపు ఆధారిత హాజరు మరింత ప్రాధాన్యం సంతరించుకోనుంది. అంటే కూలీ పనికి వచ్చినట్లు కేవలం మస్టర్‌లో పేరు ఉండటం సరిపోదు. నిర్దేశిత డిజిటల్ విధానంలో హాజరు నమోదు కావాల్సి ఉంటుంది.సాంకేతిక కారణాలతో హాజరు నమోదు కాకపోతే ఆ రోజు పనికి వచ్చిన కూలీ పరిస్థితి ఏమిటన్నది అధికార యంత్రాంగం స్పష్టత ఇవ్వాల్సిన అంశంగా మారింది.
బిల్లులు.. చెల్లింపులు బంద్
హాజరు ఆధారంగానే టెక్నికల్ అసిస్టెంట్లు 3 రోజుల్లో కొలతలు రికార్డు చేస్తారు. అనంతరం ఎఫ్‌టీవోలు జనరేట్ అయి ఐఎఫ్‌ఎంఐఎస్, పీఎఫ్‌ఎంఎస్, ఆర్బీఐల ద్వారా నేరుగా ఖాతాల్లోకి వేతనం జమవుతుంది. మొదటి దశ అయిన ఈ–కేవైసీయే లేకపోతే బిల్లుల వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుంది.ఇది ఇలా ఉంటేఈ నెల 21 నుంచి కొత్త విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో మిగిలిన కూలీలందరికీ ఈ-కేవైసీ పూర్తి చేయించడం అధికారులకు తక్షణ సవాల్‌గా మారింది. ఇప్పటికే తక్కువ పురోగతి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.లేకపోతే నిబంధనల అమలు ప్రారంభమైన తర్వాత ‘పని ఉంది.. కానీ హాజరు లేదు; హాజరు లేదు.. కాబట్టి వేతనం లేదు’ అనే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంది. ఉపాధి హామీ పథకం లక్ష్యం కూలీలకు పని కల్పించడం కాగా.. సాంకేతిక ధ్రువీకరణే వారికి పనికి అడ్డంకిగా మారకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆదిశగా అధికారులు చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి.