Khairatabad Bypoll: స్వేచ్ఛ బ్యూరో: ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధిష్ఠానం దృష్టి సారించింది. గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో తొందరపడకుండా స్థానిక పరిస్థితులు, సామాజిక సమీకరణాలు, నాయకుల బలాబలాలు, నియోజకవర్గంలో వ్యక్తిగత పరిచయాలు వంటి అంశాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎవరిని బరిలోకి దింపితే పార్టీకి ప్రయోజనం ఉంటుందనే అంశంపై నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నట్లు సమాచారం. పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేసే సామర్థ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
ప్రజాభిప్రాయంపై అధిష్ఠానం దృష్టి
ఉప ఎన్నికలో ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై బీఆర్‌ఎస్ నాయకత్వం నియోజకవర్గ స్థాయిలో అభిప్రాయ సేకరణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. స్థానిక నేతలు, పార్టీ శ్రేణులు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన ముఖ్యులు అభిప్రాయాలు.. ఏ అభ్యర్థికి ప్రజల్లో ఆదరణ ఉంది? ఎవరి ద్వారా పార్టీ క్యాడర్‌ను ఏకతాటిపైకి తీసుకురావచ్చు? ఎవరికి వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉంది? అనే అంశాలపై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.అభ్యర్థి ఎంపికలో కేవలం పార్టీ పదవి లేదా గతంలో పోటీ చేసిన అనుభవానికే కాకుండా.. నియోజకవర్గంలో గెలుపు అవకాశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలు, డివిజన్లలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది? గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఎవరికి స్థానికంగా మంచి పరిచయాలు ఉన్నాయా? పార్టీకి చెందిన వివిధ వర్గాలను ఎవరు సమన్వయం చేయగలరు? అనే అంశాలపై సమాచారం సేకరిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ప్రజల్లో వ్యక్తిగతంగా ఉన్న ఆదరణను కూడా అభ్యర్థి ఎంపికలో కీలకంగా పరిగణించే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్టీకి విధేయతతోపాటు నియోజకవర్గంలో స్వంత బలం ఉన్న నాయకుడి కోసం అన్వేషణ సాగుతున్నట్లు సమాచారం.
నలుగురి పేర్లపై పరిశీలన?
ఖైరతాబాద్ టికెట్ కోసం ఇప్పటికే నలుగురి పేర్లను బీఆర్‌ఎస్ నాయకత్వం వివిధ స్థాయిల్లో పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడు సాయికిరణ్‌యాదవ్, పీజేఆర్ కుమారుడు విష్ణు, ప్రస్తుత నియోజకవర్గ ఇన్ చార్జీ మన్నె గోవర్దన్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు మరికొందరి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.దాసోజు శ్రవణ్ గతంలో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీగా ఉన్నారు. సాయికిరణ్‌యాదవ్ కూడా నియోజకవర్గ రాజకీయాల్లో చర్చలో ఉన్న పేర్లలో ఒకటిగా ఉన్నారు. పీజేఆర్ కు నియోజకవర్గంలో అభిమానులు ఉన్నారు. దీంతో విష్ణుకు కలిసి వచ్చే అవకాశాలను సైతం పరిశీలన చేస్తున్నారు. గోవర్దన్ రెడ్డి సైతం పార్టీ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి ఉన్నారు. అయితే తుది నిర్ణయం మాత్రం ఇప్పటికిప్పుడు తీసుకునే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాతే అభ్యర్థిని ఖరారు చేయాలని నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
‘గెలుపు అవకాశాలు’ ఎవరికో?
ఉప ఎన్నికను సాధారణ ఎన్నికగా కాకుండా పార్టీ భవిష్యత్ వ్యూహాలకు ఉపయోగపడే పోరుగా బీఆర్‌ఎస్ భావిస్తోంది.హైదరాబాద్‌లో పార్టీ బలాన్ని మరోసారి చాటుకోవడానికి ఇది కీలక అవకాశంగా నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇటీవలి కాలంలో హైదరాబాద్ పరిధిలో జరిగిన రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ స్థానాలు కోల్పోవడం నేపథ్యంలో ఖైరతాబాద్ ఫలితానికి ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో ఈసారి అభ్యర్థి ఎంపికలో ప్రయోగాలకు వెళ్లకుండా.. స్థానికంగా బలమైన నేత, ప్రజల్లో పరిచయం ఉన్న వ్యక్తి, క్యాడర్‌ను సమన్వయం చేసుకోగల నాయకుడిని ఎంపిక చేయాలనే ఆలోచనలో బీఆర్‌ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ స్థానంను ఎలాగైనా నిలుపుకోవాలని అందుకు తగినట్లు వ్యూహరచన చేస్తుంది. అభ్యర్థి ఎంపికలో సీనియారిటీ, పార్టీ పదవులు మాత్రమే కాకుండా స్థానికంగా ఉన్న రాజకీయ బలాన్ని కూడా లెక్కలోకి తీసుకునే అవకాశం ఉంది.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ‘సెమీ ఫైనల్’?
ఖైరతాబాద్ ఉప ఎన్నికకు మరో ప్రాధాన్యం కూడా ఉంది. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు జరిగే ఈ పోరు హైదరాబాద్‌లో మూడు ప్రధాన పార్టీల బలాబలాలను అంచనా వేసేందుకు రాజకీయంగా కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే మునిసిపల్ ఎన్నికలను బీఆర్‌ఎస్ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ ప్రాంతాల్లో పార్టీ ప్రభావాన్ని నిలబెట్టుకోవడం బీఆర్‌ఎస్‌కు ముఖ్యమైన అంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పార్టీ ప్రదర్శన.. గ్రేటర్ పరిధిలో బీఆర్‌ఎస్ క్యాడర్ ఉత్సాహం, భవిష్యత్ వ్యూహాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉప ఎన్నిక ఫలితాన్ని ఆధారంగా చేసుకుని జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక, డివిజన్ స్థాయి వ్యూహాలు, స్థానిక నేతలకు ప్రాధాన్యం వంటి అంశాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
క్యాడర్ బలోపేతంపైనా దృష్టి
ఉప ఎన్నిక సందర్భంగా కేవలం అభ్యర్థి ఎంపికకే పరిమితం కాకుండా నియోజకవర్గంలోని పార్టీ యంత్రాంగాన్ని కూడా బలోపేతం చేయాలని బీఆర్‌ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. డివిజన్ల వారీగా పార్టీ పరిస్థితి, నాయకుల మధ్య సమన్వయం, స్థానిక సమస్యలపై ప్రజల అభిప్రాయం తదితర అంశాలపై ఇప్పటికే సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయానికి అభ్యర్థిని ఖరారు చేసి, ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేయాలన్న ఆలోచనలో నాయకత్వం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
సామర్థ్యం ఉన్న అభ్యర్థిపై ప్రధాన దృష్టి..
ఖైరతాబాద్ పోరు ద్వారా హైదరాబాద్‌లో పార్టీ పునరుద్ధరణకు దిశానిర్దేశం చేసుకోవాలన్న లక్ష్యంతో బీఆర్‌ఎస్ ముందుకు సాగుతున్నట్లు రాజకీయ పరిణామాలు సూచిస్తున్నాయి. అందుకే ఈసారి ‘పార్టీకి నమ్మకమైన వ్యక్తి’ కంటే ‘నియోజకవర్గంలో గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థి’ ఎంపికపైనే గులాబీ అధిష్ఠానం ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది? పార్టీ పరిశీలనలో ఉన్న పేర్లలో ఎవరిని ఎంపిక చేస్తుంది? స్థానిక ఫీడ్‌బ్యాక్ ఏ దిశగా ఉంది? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.
Also Read: తెలంగాణ ఉపాధి హామీ కూలీలకు షాక్.. ఈ-కేవైసీ లేకపోతే వేతనాలు బంద్!