Telangana Panchayat Elections: తెలంగాణలో జరుగుతోన్న పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా సాగుతోంది. తాజాగా విడుదలైన తొలి విడత ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఓటర్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఊహించని ఝలక్ ఇచ్చారు. తాము తప్పకుండా గెలుస్తామని ధీమాతో ఉన్న నేతలు.. ఈ ఫలితాలు చూసి షాకవుతున్నారు. ఆయా చోట్ల బీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థులు సర్పంచ్‌లుగా ఘన విజయం సాధించారు. భద్రాచలం, జడ్చర్ల, మహబూబాబాద్ ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీచింది. దీంతో మిగతా దశల్లో జరిగే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఉత్కంఠ నెలకొంది.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి సొంత ఊరిలో ఎదురుగాలి
కాంగ్రెస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి ఆయన సొంత ఊరిలోనే ఎదురుగాలి వీచింది. మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడలో సర్పంచ్‌గా బీజేపీ బలపర్చిన అభ్యర్థి కాటెపాగ రేవతి 31 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ మద్దతుదారుడిపై గెలుపొందారు. ఎమ్మెల్యే సొంత గ్రామ పంచాయతీలోనే కాంగ్రెస్ మద్దతుదారు ఓటమిపాలు కావడంపై నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు ఖంగుతిన్నాయి.
మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీకి స్వగ్రామంలో ఎదురుదెబ్బ
మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్‌కు తన స్వగ్రామంలో ఎదురుదెబ్బ తగిలింది. సోమ్లాతండాలో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన ఎమ్మెల్యే మురళి సొంత వదిన భూక్యా కౌసల్య ఓటమి చవిచూడటం చర్చనీయాంశమైంది. భూక్యా కౌసల్యపై ఇస్లావత్ సుజాత అనే మహిళ 27 ఓట్లతో విజయం సాధించడం సంచలనం రేపుతోంది.
ఫిరాయింపు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సొంతూరులో వ్యతిరేకత
ఫిరాయింపు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు సొంతూరి ప్రజలు తీవ్ర వ్యతిరేకతను చూపారు. భద్రాచలం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన స్వగ్రామమైన పంచాయతీలో బీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మడకం జోగయ్య ఘన విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు.
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు షాక్
షాద్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు షాక్ ఇచ్చారు సొంత ఊరు ప్రజలు. ఎమ్మెల్యే సొంత ఊరు వీర్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శేఖర్ గౌడ్‌పై బీఆర్ఎస్ అభ్యర్థి పాండు విజయం సాధించారు.
Also Read: పల్లె పోరులో కాంగ్రెస్ జయభేరి.. 2383 అభ్యర్థుల గెలుపు
మంత్రి సీతక్క ఇలాకాలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు
అలాగే మంత్రి సీతక్క ఇలాకాలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. ములుగు జిల్లాలో 3,230 ఓట్ల భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ములుగు జిల్లాలోనే అతిపెద్ద గ్రామమైన ఏటూరు నాగారం సర్పంచ్ స్థానం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 3,230 ఓట్ల భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కాకులమర్రి శ్రీలత విజయం సాధించారు.