Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తలపెట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ పూర్తిగా ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా సాగే సదస్సు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల డిసెంబర్ 8వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ రెండు రోజుల సదస్సు ప్రధాన ఉద్దేశం.. రాబోయే 20 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి, అభివృద్ధి ప్రణాళికలను ప్రతిబింబించే ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ను ఆవిష్కరించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని అన్నారు.
భారతదేశం స్వాతంత్ర్యం పొంది 2047 నాటికి వంద సంవత్సారాలు..
2047 నాటికి భారతదేశం స్వాతంత్ర్యం పొంది వంద సంవత్సరాలు పూర్తయ్యే నాటికి, తెలంగాణ రాష్ట్రాన్ని $3$ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా, దేశ జీడీపీలో 10 శాతం వాటాను సాధించే స్థాయికి తీర్చిదిద్దే రోడ్ మ్యాప్‌ను ఈ విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. ఈ డాక్యుమెంట్, రాష్ట్ర అభివృద్ధికి, పెట్టుబడిదారులకు స్పష్టమైన మార్గనిర్దేశం చేయనుంది.
ప్రజా భవన్‌లో సీఎం రేవంత్ సమీక్ష..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా భవన్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన ఏర్పాట్లు, విజన్ డాక్యుమెంట్ తుది రూపకల్పనపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
విజన్ డాక్యుమెంట్‌ను తుది రూపునకు సీఎం పలు సూచనలు
సీఎం రేవంత్ రెడ్డి.. భవిష్యత్తు వృద్ధి ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని ఈ విజన్ డాక్యుమెంట్‌కు తుది రూపు ఇవ్వాలని, దీనిని సాధారణ ప్రజలకు సైతం డిజిటల్‌గా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. దేశ విదేశాలకు చెందిన దాదాపు 3 వేల మంది ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులను ఈ సదస్సుకు ఆహ్వానించారు.
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో గ్లోబల్ సమ్మిట్
ముఖ్యమంత్రి ఈ గ్లోబల్ సమ్మిట్ విజయాన్ని ప్రపంచ ఆర్థిక వేదిక అయిన దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ప్రదర్శించాలనే తన సుదూర లక్ష్యాన్ని కూడా అధికారులకు వివరించారు. ఈ సదస్సుకు సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్‌ను శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో కలిసి విడుదల చేయనున్నారు.
డిసెంబర్ 8, 9 తేదీల్లో మాత్రమే ప్రముఖులకు ఆహ్వానం..
దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాల రద్దు వంటి సమస్యలు తలెత్తకుండా, హైదరాబాద్‌కు వచ్చే, వెళ్లే అతిథులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9 తేదీల్లో మాత్రమే ప్రముఖులకు ఆహ్వానం ఉండగా, డిసెంబర్ 10 నుంచి 13వ తేదీ వరకు ప్రజలు ఉచితంగా వీక్షించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి
విజన్ డాక్యుమెంట్‌లో రాష్ట్ర… pic.twitter.com/defTqhtspx
— BIG TV Breaking News (@bigtvtelugu) December 5, 2025