Mule Accounts: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ అధికారులు ఖమ్మం పోలీసులతో కలిసి జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్ జరిపారు. దీంట్లో విదేశాల్లో ఉంటూ మన దేశంలో సైబర్ మోసాలకు పాల్పడుతున్న చైనా కేటుగాళ్లకు మ్యూల్ అకౌంట్లు సమకూరుస్తున్న పలువురిని అరెస్ట్ చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కొంతకాలం క్రితం ఖమ్మంలోని వీఎం బంజారా, సత్తుపల్లి పోలీస్ స్టేషన్లలో సైబర్ మోసాలకు సంబంధించి రెండు కేసులు నమోదయ్యాయి. విచారణలో ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు తమ బ్యాంక్ ఖాతాలను సైబర్ క్రిమినల్స్ కు సమకూర్చి పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకుంటున్నట్టుగా వెల్లడైంది. దాంతోపాటు చైనా మోసగాళ్లతో సమన్వయం ఏర్పరుచుకుని టెలిగ్రామ్ లోని గ్రూపుల ద్వారా అనధికార ఆన్ లైన్ గేమింగ్ చెల్లింపులు, వచ్చిన డబ్బు లావాదేవీలకు కూడా ఈ ఖాతాలను ఉపయోగించినట్టుగా తేలింది.
ఈ క్రమంలో రెండు కేసులను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు మార్చారు. వీఎం బంజారా పోలీస్ స్టేషన్ నుంచి బదిలీ అయిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని జరిపిన విచారణలో మ్యూల్ అకౌంట్ల నెట్ వర్క్ డొంక మొత్తం కదిలింది. ఈ క్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఖమ్మం పోలీసులతో కలిసి స్పెషల్ ఆపరేషన్ జరిపారు. దీంట్లో ఖమ్మంకు చెందిన మురళీకృష్ణ, వడ్లమూడి సాయి శ్రీనివాస్ లను అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు సైబర్ క్రిమినల్స్ కు పది మ్యూల్ అకౌంట్లు సమకూర్చినట్టుగా వెల్లడైంది.ఈ ఇద్దరిని జరిపిన విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగా రెండు కేసుల్లో కలిపి మొత్తం 52మంది మ్యూల్ అకౌంట్ సరఫరాదారులను అరెస్ట్ చేశారు.
Also read: రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ
స్పెషల్ ఆపరేషన్ లో సంచలన వివరాలు వెలుగు చూశాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 30బ్యాంక్ శాఖల్లో 121మ్యూల్ అకౌంట్లు ఉన్నట్టుగా వెల్లడైంది. ఇక, కేవలం ఏటీఎంల ద్వారా నగదును డ్రా చేసిన 273 ఖాతాలను అధికారులు గుర్తించారు. 20వేలకు మించిన చెక్ విత్ డ్రాయల్స్ కు సంబంధించి మరో 12 అకౌంట్లను గుర్తించారు. దేశవ్యాప్తంగా జరిగిన పలు సైబర్ నేరాలతో ఈ అకౌంట్లకు లింక్ ఉన్నట్టుగా తేలింది. ఈ ఖాతాల ద్వారా 7.84కోట్ల రూపాయల లావాదేవీలు జరుగగా వాటిలో 6.23 కోట్ల రూపాయల లావాదేవీలు వివాదాస్పదమైనవని బయటపడింది.
ఈ స్పెషల్ ఆపరేషన్ లో 40మంది పోలీసులు 11బృందాలుగా విడిపోయి తనిఖీలు జరిపారు. లభించిన ఆధారాలు, అరెస్టుల నేపథ్యంలో ఖమ్మం టౌన్ పోలీస్ స్టేషన్ లో 7, ఖనాపురం హవేలీ (హెచ్) స్టేషన్ లో 7, ఖమ్మం వన్ టౌన్ స్టేషన్ లో 1, ఖమ్మం త్రీ టౌన్, ఖమ్మం రూరల్ స్టేషన్లలో రెండు చొప్పున, కారేపల్లి, నేలకొండపల్లి, కామేపల్లి స్టేషన్లలో ఒకటి చొప్పున ఎఫ్ఐఆర్ లు జారీ చేశారు. ఆపరేషన్ ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ సాయి శ్రీ, ఖమ్మం సీపీ సునీల్ దత్ పర్యవేక్షించారు. డీఎస్పీలు కే.ఎం.ప్రసాద్, వెంకటయ్యలు దాడుల్లో పాల్గొన్నారు. ఈ కేసుల్లో విచారణ కొనసాగుతోందని, త్వరలోనే మరికొన్ని అరెస్టులు ఉంటాయని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు.
Also read: అల్లు అర్జున్ ‘రాకా’ విడుదల ఎప్పుడంటే… ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదా?