Natti Kumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు దగ్గరపడుతున్న సినీ ఇండస్ట్రీలో మంటలు రాజుకుంటున్నాయి. ఆదివారం జరగనున్న ఈ ఎన్నికల్లో వివిధ ప్యానెల్స్‌తో పాటు కొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో నిలిచిన సంగతి తెల్సిందే . ఈ క్రమంలో సీనియర్ నిర్మాత నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
తాను ఏ ప్యానెల్‌కు చెందకుండా స్వతంత్ర అభ్యర్థిగా ట్రెజరర్ పదవికి పోటీ చేస్తున్నానని, తన ప్రధాన లక్ష్యం నిర్మాతల సంక్షేమమేనని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో తన కుమారుడు నట్టి క్రాంతి ఎగ్జిక్యూటివ్ మెంబర్ పదవికి పోటీ చేస్తున్నారని తెలిపారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని తన సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నట్టి కుమార్ ఎన్నికలపై తన అభిప్రాయాలను ఇలా చెప్పుకొచ్చారు.కౌన్సిల్ ఎన్నికల్లో ప్రధానంగా రెండు ప్యానెల్స్ పోటీ చేస్తున్నాయని, అయితే అవి చేయలేని కొన్ని పనులను తాను చేసి చూపిస్తాననే నమ్మకంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగినట్టు చెప్పారు. ముఖ్యంగా నిర్మాతలు, కౌన్సిల్ సభ్యుల ఆరోగ్యం, ఆర్థిక భద్రత, భవిష్యత్ అవసరాలపై తన దృష్టి ఉంటుందని అన్నారు.
ఇక మెడిక్లెయిమ్ హెల్త్ పాలసీ అంశాన్ని ప్రస్తావిస్తూ గతంలో ఇచ్చిన కొన్ని హామీలు అమలుకు నోచుకోలేదని నట్టి కుమార్ మండిపడ్డారు.ముఖ్యంగా మెడిక్లెయిమ్ విషయంలో సభ్యులందరికీ ఒకే విధమైన న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. కొందరికి ఒక రకమైన లెక్క, మరికొందరికి మరో రకమైన విధానం ఉండకూడదని వ్యాఖ్యానించారు. కౌన్సిల్ వ్యవహారాల్లో ఆర్థిక పారదర్శకత, క్రమం తప్పకుండా ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశాలు, ఖర్చులకు సరైన లెక్కలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రోగ్రెసివ్ ప్యానెల్‌లో ట్రెజరర్ అభ్యర్థిగా ఉన్న స్రవంతి రవికిషోర్‌పై కూడా నట్టి కుమార్ వ్యాఖ్యలు చేశారు. చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఆయనకు మంచి పరిజ్ఞానం ఉన్నప్పటికీ, నిర్మాతల సంక్షేమ పథకాల విషయంలో తనకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని ఆరోపించారు.
అయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్న రెండు ప్యానెల్స్‌లోని చాలామంది తనకు వ్యక్తిగతంగా సన్నిహితులేనని, వ్యక్తిగత సంబంధాల కంటే కౌన్సిల్ ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్పారు.ఇక కౌన్సిల్ సభ్యులకు రూ.10 లక్షల మెడిక్లెయిమ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకురావడమే తన మొదటి లక్ష్యాల్లో ఒకటని , ప్రస్తుతం ఉన్న డెత్ ఫండ్‌ను రూ.10 లక్షలకు పెంచడం, పెన్షన్ మొత్తాన్ని రూ.5 వేలకు పెంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇవన్నీ కేవలం ఎన్నికల హామీలు కాదని, తనకు అవకాశం ఇస్తే కార్యాచరణతో ముందుకు వెళ్తానని చెప్పారు.
తాను ట్రెజరర్‌గా గెలిచిన తర్వాత ఆరు నెలల్లో ఈ హామీలను అమలు చేసే దిశగా ఫలితాలు చూపించలేకపోతే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించడం ఇక్కడ గమనార్హం.ఇక తనకు చిరంజీవి ఆశీస్సులు ఉన్నాయని చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోలతో మాట్లాడి అయినా నిర్మాతల సంక్షేమానికి అవసరమైన కార్యక్రమాలను అమలు చేయడానికి తాను వెనుకాడనని అన్నారు.
అదే సమయంలో ఓటర్ లిస్ట్ విషయంలోనూ నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాబితాలో అనుమానాస్పదంగా ఉన్న ఓట్లపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలని, ప్రతి సభ్యుడి ఓటుకు విలువ ఉండాలని అన్నారు.
గతంలో కూడా తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసి సభ్యుల మద్దతుతో గెలిచానని గుర్తు చేసిన నట్టి కుమార్, ఈసారి ట్రెజరర్‌గా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. దాసరి నారాయణరావు శిష్యుడిగా, చిరంజీవి అభిమానిగా తాను నిర్మాతల కోసం ఎప్పటికీ పోరాడుతూనే ఉంటానని చెప్పారు. తాను గెలిచినా, ఓడినా నిర్మాతల సమస్యలపై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
ALSO READ:సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!
ఒకవైపు ప్యానెల్స్ మధ్య పోటీ, మరోవైపు ఇండిపెండెంట్‌గా నట్టి కుమార్ చేసిన హామీలు, సవాళ్లు.. నిర్మాతల ఓటు ఎటువైపు వెళ్తుందో కాలమే డిసైడ్ చేయాలి !