KTR Talent: స్వేచ్ఛ బ్యూరో: భౌగోళిక పరిమితులు పెద్ద అడ్డంకి కాదని, ప్రతిభ మాత్రమే ముఖ్యమని, టైర్-2, టైర్-3 నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామాల్లోని యువతలో అపారమైన ప్రతిభ ఉందని, సరైన ప్రతిభను గుర్తించి అవకాశాలు కల్పిస్తే సంస్థలు అద్భుతంగా ఎదగగలవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఫీనిక్స్ ప్రైమియా భవనంలో కాన్‌స్టర్ సొల్యూషన్స్ కంపెనీ నూతన కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచం వేగంగా మారుతోందని, డేటా, డేటా సెంటర్లు, సర్వర్లు, కృత్రిమ మేధస్సు (ఏఐ), కంటెంట్ రంగాల్లో అపారమైన అవకాశాలు ఏర్పడుతున్నాయన్నారు.
ప్రభుత్వం, పరిశ్రమ రెండు రంగాల కోణాల నుంచి గత 2 దశాబ్దాలుగా టెక్నాలజీ ప్రపంచాన్ని అత్యంత దగ్గరగా చూసిన అనుభవంతో చెబుతున్నానని, ప్రస్తుతం ఈ రంగాల్లో పనిచేస్తున్న వారికి అద్భుతమైన భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. వివిధ టైమ్‌జోన్లలో పనిచేస్తూ, అనేక దేశాల ఖాతాదారులతో కలిసి పనిచేయడం ఎంతటి సవాలో తనకు తెలుసన్నారు.ప్రపంచవ్యాప్తంగా కంటెంట్ వినియోగం, ఉత్పత్తి విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దానిని నిల్వ చేయడం, నిర్వహించడం, ప్రపంచానికి చేరవేయడంలో కాన్‌స్టర్ వంటి సంస్థలకు కీలక పాత్ర ఉంటుందన్నారు. యువతరం మొబైల్ ఫోన్‌లో ఒక్కోసారి స్వైప్ చేస్తూ ప్రపంచాన్ని చూస్తోందని పేర్కొన్నారు. ప్రతి స్వైప్ వెనుక భారీ స్థాయిలో కంటెంట్ ఉత్పత్తి, నిల్వ, పంపిణీ జరుగుతోందని, ఈ డిజిటల్ విప్లవంతో డేటా, స్టోరేజ్ రంగాల ప్రాధాన్యత మరింత పెరుగుతోందన్నారు.
టైర్-2, టైర్-3 నగరాలపై కాన్‌స్టర్ సొల్యూషన్స్ సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టడం ఆనందాన్ని కలిగించిందన్నారు. చిన్న పట్టణాలు, నగరాల నుంచి వచ్చే యువతలో అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆకలి, పట్టుదల ఎక్కువగా ఉంటుందని అన్నారు. ప్రతిభావంతులైన యువతను ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు తీసుకురావడం కంటే, కంపెనీలు వారివద్దకే వెళ్లి అవకాశాలు కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టైర్-2 నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించాలనే లక్ష్యంతో అనేక ఐటీ హబ్‌లను నిర్మించామని గుర్తు చేశారు.
Also read; తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?
ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, సిద్ధిపేట, సూర్యాపేట, మహబూబ్‌నగర్, కరీంనగర్ వంటి నగరాల్లో ఐటీ హబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన యువతకు వారి స్వస్థలాల్లోనే ఉద్యోగ అవకాశాలు అందించడమే తమ లక్ష్యమన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పని చేసే విధానాన్నే పూర్తిగా మార్చేసిందన్నారు. ఒకప్పుడు కార్యాలయానికి వచ్చి, ఒకే చోట కలిసి పనిచేస్తేనే పనులు జరుగుతాయని భావించేవాళ్లమని, కానీ కోవిడ్ తర్వాత ప్రపంచంలో ఎక్కడి నుంచైనా పనిచేసి సమర్థవంతంగా ఫలితాలు సాధించవచ్చని నిరూపితమైందన్నారు. ఒక సంస్థ ఎదుగుదలకు ఉన్న అవకాశాలకు హద్దులు ఉండవని, మన ఊహాశక్తి, ఆశయం, అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యమే ఎదుగుదలను నిర్ణయిస్తుందని చెప్పారు.
మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదిక నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. యూరప్‌లో స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటల్, పెట్టుబడుల రంగాలకు సంబంధించిన ప్రముఖ కార్యక్రమం లక్సెంబర్గ్ వెంచర్ డేస్-2026లో కీలకోపన్యాసం చేయాలని నిర్వాహకులు ఆహ్వానించారు. లక్సెంబర్గ్‌లో అక్టోబర్ 14, 15 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమానికి లక్స్ ఇన్నోవేషన్, ఎంబర్గ్ ప్రైవేటు ఇక్విటీ, వెంచర్ క్యాపిటల్ అసోసియేషన్ తరఫున ఆహ్వానం అందింది.
Also read: ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!