Bhadradri Kothagudem News: తెలంగాణలో 69వ రాష్ట్ర స్థాయి క్రీడలు మా జిల్లాలోని తన నియోజకవర్గంలో జరగడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఎంతోమంది క్రీడాకారులను అందించిన ఘనత తన నియోజకవర్గానికి ఉందన్నారు. ఈ క్రీడల్లో రాణించినవారు జాతీయ స్థాయి క్రీడల్లో సత్తా చాటిన సందర్భాలు ఉన్నాయన్నారు. జిల్లాతోపాటు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులను ఉద్దేశించి అన్నారు.
ఏడూళ్లబయ్యారం జెడ్పీ పాఠశాలలో 69వ క్రీడల (అండర్-17) పోటీలు
శనివారం భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని పినపాక మండల ఏడూళ్లబయ్యారం జెడ్పీ పాఠశాలలో రాష్ట్రస్థాయి 69వ క్రీడల (అండర్-17) పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు డీఈవో-సీఈఓ నాగలక్ష్మిలు హాజరయ్యారు.
ఈ పోటీల్లో తలపడేందుకు తెలంగాణలోని 10 ఉమ్మడి జిల్లాల నుంచి బాలికలు, బాలురు పదేసి జట్ల చొప్పున పాల్గొన్నాయి. ఈ సందర్బంగా క్రీడాకారులు ముఖ్య అతిథులకు మార్చ్ ఫాస్ట్ నిర్వహించి, గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేశారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఎంతోమంది వెలుగులోకి రాలేకపోతున్నారని అన్నారు.
తొలిరోజు ఆటలో సంచలనాలు నమోదు
ఈ తరహా క్రీడల తర్వాత గ్రామీణ క్రీడాకారులు ముందుకొచ్చే అవకాశముందన్నారు. గ్రామీణ క్రీడగా పేరుపొందిన కబడ్డీ ఆడడం వల్ల శారీరక ఫిట్ నెస్ వస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ చెప్పారు. టాలెంట్ ఉంటే అనుకోకుండా అవకాశాలు వస్తాయని చెప్పుకొచ్చారు. అందరికీ ఒక రకమైన టాలెంట్ ఉండదని ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు.
తాము ఎంచుకున్న రంగంలో రాణించాలన్నారు. ఉన్నత స్థాయికి చేరుకునేందుకు కష్టపడాలని సూచించారు. దీనివల్ల తల్లిదండ్రులతోపాటు గ్రామానికి, గురువులకు మంచి పేరు వచ్చేటట్లుగా ఉండాలన్నారు. ఆటల్లో గెలుపోటములు సహజమన్నారు. వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ఎదగాలన్నారు. క్రీడలు ఆరోగ్యానికి దోహదం చేస్తాయన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి. ఆటలు మానసిక స్థైర్యాన్ని ఇస్తాయని గుర్తు చేశారు.
ALSO READ: కాలేజీలో అడ్డాగా.. హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా, ఈగల్ టీమ్ దాడులు
ఇక క్రీడల పోటీల విషయానికి వద్దాం. తొలి రోజు పోటీలు వివిధ జట్ల హోరాహోరీగా సాగాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా బాలబాలికల జట్టు సత్తా చాటింది. నల్గొండతో జరిగిన మ్యాచ్ లో వరంగల్ బాలురు జట్టు విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో కరీంనగర్ జట్టుపై ఖమ్మం బాలురు జట్టు విజయం సాధించింది. బాలికల విషయానికి వద్దాం. హైదరాబాద్-ఖమ్మం జట్ల మధ్య పోటీ ఏకపక్షంగా సాగింది. ఖమ్మం బాలికల జట్టు విజయం సాధించింది.