Hyderabad Drug Case: మత్తు వదలుతారా.. వదిలించమంటారా అన్న రేంజ్‌లో తెలంగాణ సర్కార్ డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్స్ మహమ్మారిని చిత్తు చేయడమే టార్గెట్‌గా ఈగల్ టీమ్‌లు డేగ కన్నేసి దాడులు చేస్తున్నాయి. డ్రగ్స్, గంజాయి సమూల ప్రక్షాళనే లక్ష్యంగా స్పెషల్ ఆపరేషన్లతో పెడ్లర్లకు చెమటలు పట్టిస్తున్నాయి. వాళ్లు.. వీళ్లు అనే తేడా లేకుండా దొరికినోళ్లను దొరికినట్లు మడతపెట్టేస్తోంది ఈగల్ టీమ్.
బేగంపేట క్యులినరీ హోటల్ మేనేజ్‌మెంట్ అకాడమీలో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్
తాజాగా నిన్న హైదరాబాద్ బేగంపేట్ క్యులినరీ హోటల్ మేనేజ్‌మెంట్ అకాడమీలో డ్రగ్స్ దొరికాయి. ఈగల్, నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడులలో ఆరుగురు విద్యార్థులు గంజాయి తీసుకున్నట్టు గుర్తించారు. డ్రగ్ టెస్టుల్లో పాజిటీవ్‌గా వచ్చినట్టు తెలిపారు. స్టూడెంట్స్ స్నేహితుడే డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి.. డీ- అడిక్షన్ సెంటర్‌కు తరలించారు పోలీసులు.గతంలో ఇదే కాలేజీలో ఒ స్టూడెంట్ నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సీజ్ చేసింది ఈగల్ టీం.
డ్రగ్స్ దందా కొనసాగుతోందని ఈగల్ టీం దర్యాప్తులో వెల్లడి
కాలేజీలే అడ్డాగా విద్యార్థులే కస్టమర్లుగా డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్లు ఈగల్ టీం దర్యాప్తులో వెల్లడైంది. మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో డ్రగ్స్ దందా పెట్రేగిపోతున్నట్లు బట్టబయలు అయింది. భారీగా డ్రగ్స్ దొరుకుతున్నాయి. వాటికి బానిసలవుతోంది స్టూడెంట్సే అన్న విషయం ఆందోళన కలిగిస్తోంది. కాలేజీల్లో డ్రగ్స్ విచ్చలవిడిగా తీసుకుంటున్నారని ఈగల్ టీమ్ గుర్తించింది.
మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో డ్రగ్స్ దందా బట్టబయలు..
ఉస్మానియా మెడికల్ కాలేజ్, జోగిపేట జేఎన్‌టీయూ కాలేజ్, గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్, సీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్,బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీ విద్యార్థులు డ్రగ్స్ తీసుకొని ఈగల్ టీంకు అడ్డంగా బుక్కయ్యారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో డ్రగ్స్‌కు బానిసై ఆరుగురు వైద్యులు ఈగల్ టీం ఆపరేషన్‌లో దొరికిపోయారు. ఆగస్టు 26న హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీలో రెయిడ్స్ చేసి నలుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. మెడిసిటీ కాలేజీలో పలువురు విద్యార్థులను అరెస్ట్ చేసి గంజాయిని సీజ్ చేశారు.ఇలా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కాలేజీల్లో స్టూడెంట్స్ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు గుర్తించింది.
Also Read: తమాషాలు చేస్తే తాట తీస్తా.. ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ వార్నింగ్
తెలంగాణ సర్కార్ డ్రగ్స్‌పై ఉక్కుపాదం..
ఇకపై డ్రగ్స్ వ్యవహారంలో తగ్గేదేలే అంటోంది తెలంగాణ ఈగల్ టీమ్. ఎంతటివారైనా గుట్టురట్టు అవ్వాల్సిందే అనే రేంజ్‌లో విరుచుకుపడుతోంది. అంతేకాదు.. ఇటీవల డ్రగ్స్ కేసుల్లో విద్యార్థులు భారీగా పట్టుపడుతుండడంతో వారి విషయంలోనూ నో కాంప్రమైజ్ అంటోంది. ఈ నేపథ్యంలో.. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన యాజమాన్యాలు.. ఇలానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు..