Bandi Sanjay: ఉప ఎన్నికల వేళ బీజేపీ నేత కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తే, ఆ నియోజకవర్గం పేరును ‘సీతారామ నగర్’ గా మార్చుతానని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా రహ్మత్ నగర్ ప్రాంతం పేరు ‘మీనాక్షి పురం’గా మారుస్తామని కూడా సంజయ్ తెలిపారు. హిందూ సాంస్కృతిక విలువలకు తగిన పేర్లు ఇవ్వడం ద్వారా.. ప్రాంతీయ గుర్తింపును బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు.
ఇదే సభలో ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) పై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న జూనియర్, సీనియర్ క్రికెట్ సెలెక్షన్‌లలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని సంజయ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతిభావంతమైన క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం లేదు. డబ్బు తీసుకుని అర్హతలేని ప్లేయర్లను ఎంపిక చేస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి తమ గోడు చెప్పారు అని ఆయన వెల్లడించారు.
HCA సెలెక్షన్ కమిటీలో లక్షల రూపాయల లావాదేవీలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. నైపుణ్యం ఉన్న యువ క్రికెటర్లు బలహీన వర్గాల నుంచి వస్తే వాళ్లకు అవకాశం ఇవ్వకుండా, డబ్బు ఉన్నవారిని ప్రోత్సహిస్తున్నారు. ఇది క్రీడా వ్యవస్థకు తగదు అన్నారు. ఆయన రాచకొండ కమిషనర్‌కు ఇప్పటికే సమాచారం ఇచ్చానని, త్వరలోనే HCAపై అధికారిక విచారణ ప్రారంభమవుతుందని వెల్లడించారు.
అంతేకాక హైదరాబాదులోని కొన్ని క్రీడా సంఘాలు ప్రతిభ కంటే సిఫారసు, డబ్బును ప్రాధాన్యంగా చూస్తున్నాయి. ఇది యువ ప్రతిభను నిరుత్సాహపరుస్తుంది. క్రీడల్లో అవినీతి ఉన్నంతకాలం దేశం అంతర్జాతీయ స్థాయిలో ముందుకు వెళ్లలేదు అని సంజయ్ తీవ్రంగా విమర్శించారు.
గతంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన మంచి ఆటగాళ్లను కూడా ఈసారి సెలెక్షన్ జాబితాలో చేర్చలేదు. వారిని పక్కనబెట్టి అర్హత లేని వారిని ప్రోత్సహించడం క్రీడా న్యాయానికి విరుద్ధం. ఈ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు జరగాలి. అవసరమైతే BCCIకి కూడా ఫిర్యాదు చేస్తాం అని అన్నారు.
Also Read: నా కొడుకును చంపింది వాళ్లే.. పోలీస్ స్టేషన్‌కు మాగంటి గోపీనాథ్ తల్లి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో జరుగుతున్న అవకతవకలను బహిర్గతం చేయాలని, నిజనిజాలను త్వరలోనే ప్రజల ముందుంచుతానని బండి సంజయ్ తెలిపారు. ప్రతిభ ఉన్న క్రీడాకారుడు అర్హత లేకపోవడమే కాదు, క్రీడాస్ఫూర్తిని కూడా దెబ్బతీస్తుంది. దానికి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించదు అని అన్నారు.