Maganti Gopinath Mother: మాగంటి గోపీనాథ్ మృతిపై తల్లి మహానంద కుమారి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సునీతపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె రాయదుర్గం పీఎస్ పరిధిలో ఫిర్యాదు చేశారు. మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని దీనిపై పూర్తి దర్యాప్తు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మాగంటిని తాను చూడకుండా ఉండేందుకు సునీత కూతురు దిషిర ఏఐజీ ఆసుపత్రికి లేఖ ఇచ్చిందని మహానంద కుమారీ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను అడ్డుకుని కేటీఆర్‌ను మాత్రం అనుమతించడంపై అనుమానం వ్యక్తం చేశారు.
రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి ఒక సంచలన ఫిర్యాదు చేశారు. తన కుమారుడు గోపీనాథ్ మరణం చుట్టూ ఉన్న అనుమానాస్పద పరిస్థితులపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆమె పోలీసులను కోరారు. గచ్చిబౌలి AIG హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో జరిగిన పరిణామాలు, వైద్య సిబ్బంది ప్రవర్తన, ఆసుపత్రి భద్రతా సిబ్బంది వ్యవహారం అన్నీ ప్రశ్నార్ధకంగా ఉన్నాయని మహానంద కుమారి తన పిర్యాదులో పేర్కొన్నారు.
గోపీనాథ్ మరణానికి ముందు, తర్వాత జరిగిన అన్ని ఘటనలలో అనేక అనుమానాలు ఉన్నాయని, తన కుమారుడు ఐసీయూలో ఉన్న సమయంలో తన కొడుకుని కలవడానికి ఆసుపత్రి అనుమతించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ దిషిరా (సునీత కుమార్తె) రాతపూర్వక ఆదేశాల మేరకు భద్రతా సిబ్బంది తనను ఆసుపత్రిలోకి అనుమతించలేదని పేర్కొన్నారు. అదే సమయంలో మంత్రి కేటీఆర్‌ను మాత్రం ఎటువంటి నిరోధం లేకుండా లోపలికి అనుమతించారని ఆమె ఆరోపించారు.
ఫిర్యాదులో ఆమె వైద్య నిర్లక్ష్యం అంశాన్ని కూడా ప్రస్తావించారు. గోపీనాథ్ కిడ్నీ తొలగింపు తర్వాత తగిన శ్రద్ధ చూపలేదని, డయాలసిస్ ప్రక్రియలో ఆలస్యం జరిగిందని ఆమె ఆరోపించారు. అలాగే గోపీనాథ్ అస్వస్థతకు గురైనప్పుడు గన్‌మెన్, భద్రతా సిబ్బంది సహాయం చేయడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. ఈ నిర్లక్ష్యం, అవగాహనలోపం, ఆసుపత్రి వ్యవహారశైలే తన కుమారుడి మరణానికి కారణమని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు
తన కుమారుడి మరణ తేదీ, సమయం, ఆసుపత్రి రికార్డులు, వైద్య నివేదికలపై కుటుంబానికి ఇప్పటికీ స్పష్టత లేదని మహానంద కుమారి పేర్కొన్నారు. మరణ కారణంపై స్పష్టత లేకుండా సర్టిఫికెట్లు జారీ చేయడం, చికిత్స వివరాలను దాచిపెట్టడం చాలా అనుమానాస్పదంగా ఉంది అని ఆమె అన్నారు. ఆసుపత్రి రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, వైద్య బృందం నివేదికలను వెంటనే సీజ్ చేసి నిజాలను వెలికితీయాలని పోలీసులను విజ్ఞప్తి చేశారు.