Wines Shops Closed: తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. బీసీ సంఘాల పిలుపుతో అన్ని రాజకీయ పార్టీలు బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో వ్యాపారులు బంద్ కు మద్దతుగా దుకాణాలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీపావళికి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరిన ప్రయాణికులు బస్సులు కోసం బస్టాండ్ ల్లో వేచి చేస్తున్నారు.
అయితే బంద్ కారణంగా మద్యం దుకాణాలు కూడా మూతపడ్డాయి. దీంతో మందుబాబులకు కాళ్లూచేతులు ఆడడం లేదు. బ్లాక్ లో మందు కోసం మద్యం షాపుల చుట్టూ తిరుగుతున్నారు. బంద్ పూర్తయ్యే వరకూ షాపులు తీయమని దుకాణాల యజమానులు చెబుతున్నారు. అయితే సాయంత్రం నుంచి యథావిధిగా దుకాణాలు తెరుచుకునే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.
మందు షాపులు తెరవకపోవడం వల్ల మందుబాబులు వాపోతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా షాపులు క్లోజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం షాపులు క్లోజ్ చేస్తామని ముందే సమాచారం ఇస్తే, నిన్న సాయంత్రమే కొనుగోలు చేసేవాళ్లమని ఓ మందుబాబు వాపోయాడు. సాయంత్రం నుంచి యథావిధిగా దుకాణాలు తెరుచుకుంటాయని వార్త విని మందుబాబులు కాస్త శాంతించారు. దీపావళికి ముందు మద్యం కొనుగోళ్లు జోరుగా సాగుతాయి. అయితే ఈసారి లిక్కర్ వ్యాపారంపై బీసీ బంద్ ప్రభావం పడింది.
దీపావళి పండుగకు ముందు రెండు రోజులు వ్యాపారాలు జోరుగా సాగుతాయి. అయితే బంద్ కారణంగా కొనుగోలుదారులు బయటకు రావడంలేదు. దీంతో వ్యాపార సంస్థలు ఖాళీగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి పట్టణాల్లో శనివారం, ఆదివారం దీపావళి షాపింగ్ అధికంగా ఉంటుంది. దీంతో వ్యాపారులు భారీగా స్టాక్ సిద్ధం చేసుకున్నారు.
పండుగ సమయంలో బంద్ కు పిలుపు నివ్వడంతో ఇటు వ్యాపారులు, అటు కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. ఒక రోజు అమ్మకాలు తగ్గినా లక్షల్లో నష్టం వస్తుందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పండుగకు ముందు షాపింగ్ చేద్దామనుకున్న వారు బంద్ కారణంగా బయటకు రావడంలేదు. సాయంత్రం నుంచి దుకాణాలు తెరుచుకుంటాయని వ్యాపారులు చెబుతున్నారు.
Also Read: TG New Liquor Shops: మద్యం షాపుల దరఖాస్తులకు నేడే లాస్ట్.. కేటాయింపు ఎప్పుడంటే?
పండుగ సమయాల్లో ఇలాంటి ఆందోళనలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని వ్యాపారులు అంటున్నారు. సాయంత్రానికి బంద్ ప్రభావం తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. బీసీ సంఘాలు మాత్రం తమ డిమాండ్ల సాధన కోసం బంద్ చేస్తున్నామని చెబుతున్నాయి.