TG New Liquor Shops: తెలంగాణలో మద్యం షాపుల దరఖాస్తులకు నేడే చివరి రోజు. నేటితో దరఖాస్తు గడువు ముగియనుంది. నిన్న ఒక్క రోజే 25 వేల దరఖాస్తులు రాగా ఇప్పటి వరకూ 50 వేల దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. లిక్కర్ షాపుల దరఖాస్తుల సమర్పణ గడువు నేటితో ముగియనుండడంతో.. చివరి రోజు భారీగా దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. లక్షకు పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ తెలిపింది.
మద్యం షాపుల కేటాయింపునకు అక్టోబర్ 23న డ్రా తీస్తారు. ఈ డ్రాలో షాపులు పొందిన వారు అక్టోబర్ 23, 24న మొదటి వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. మద్యం షాపుల లైసెన్స్ ఫీజు మొత్తాన్ని ఆరు విడతలుగా చెల్లించవచ్చు. డిసెంబర్ 1 నుంచి కొత్త షాపుల లైసెన్స్ అమలులోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్‌లు నవంబర్, 2025తో ముగుస్తాయి.
అయితే ఈ ఏడాది మద్యం షాపుల దరఖాస్తు ఫారం ఫీజును 2 లక్షలు నుంచి 3 లక్షలకు పెంచారు. ఈ మొత్తా్న్ని నాన్ రిఫండబుల్‌గా ప్రభుత్వం పేర్కొంది. కొత్త మద్యం దుకాణాల లైసెన్స్ లు డిసెంబర్ 1,2025 నుంచి నవంబర్ 30, 2027 వరకు రెండేళ్ల పాటు అమల్లో ఉంటాయి.
తెలంగాణలోని 2,620 మద్యం షాపులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. దరఖాస్తు ఫీజు పెంపుతో ఆశావహులు సిండికేట్ అవుతున్నట్లు సమాచారం. దరఖాస్తు రుసుమును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు. దీంతో కొనుగోలుదారులు సిండికేట్‌గా ఏర్పడి రుసుమును కలిసి జమ చేస్తున్నారు. ఎవరో ఒక్కరి పేరు మీద లిక్కర్ షాపునకు దరఖాస్తు చేస్తున్నారు.
మద్యం షాపు వచ్చినా, రాకపోయినా దరఖాస్తు ఫీజు తిరిగి రాకపోవడంతో.. ఎక్కవ మంది సిండికేట్‌గా ఏర్పడి ఒక్కరి పేరుపై అప్లై చేసుకుంటున్నారు. మద్యం షాపు దక్కితే వాటాలపై ముందుగానే ఒప్పందాలు చేసుకుంటున్నారు. దరఖాస్తుల గడువు శనివారంతో ముగియడంతో ఆశావహులు త్వరపడుతున్నారు.
శుక్రవారం ఒక్కరోజే 25 వేల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు మొత్తం 50 వేలు దరఖాస్తులు దాటగా, చివరి రోజు మరో 50 వేల దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. అప్లికేషన్ ఫారం రుసుమును రూ.1 లక్ష అదనంగా పెంచడంతో గతంలో ఉన్నంత స్పందన రావడం లేదని విశ్లేషణలు అంటున్నారు. ఈ రుసుముపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అయితే టెండర్ల రుసుముపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు తెలిపింది.
Also Read: TG BC Bandh: బంద్‌లో అపశృతి.. బీసీ ర్యాలీలో బొక్కబోర్లా పడ్డ హనుమంత రావు, ఆయన పరిస్థితి ఎలా ఉందంటే?