Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ప్రధాన పార్టీలు ఇప్పటికీ తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగాయి. ఈ క్రమంలో విజయావకాశాలపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. అయితే, బీఆర్ఎస్-బీజేపీల పరిస్థితి ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో కీలక సమీకరణాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. రాజకీయంగా, అభివృద్ధి-సంక్షేమం, లోకల్ ఫ్యాక్టర్ పరంగా అన్ని ఈక్వేషన్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఫేవర్‌గా కనిపిస్తున్నాయి.
పక్కా లోకల్ నినాదం..
నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన స్థానికుడు. గత ఎన్నికల అనుభవాన్ని పరిశీలిస్తే ఆయన బలం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. 2014 ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ 41,656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. అలాగే 2018లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి 18,817 ఓట్లు సాధించి సత్తాచాటారు. ఇది నియోజకవర్గంలో ఆయనకు ఉన్న వ్యక్తిగత చరిష్మాకు అద్దం పడుతుంది. ఈసారి అధికార కాంగ్రెస్ పార్టీ అండదండలు, బలమైన సామాజిక వర్గం మద్దతుతో బరిలోకి దిగడం ఆయన విజయావకాశాలను మరింత మెరుగుపరిచింది.
అభివృద్ధి, సంక్షేమం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్‌లో ఇప్పటికే సుమారు ₹200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అనుకూలాంశం. దీంతోపాటు కొత్త రేషన్ కార్డుల మంజూరు, ఉచితంగా సన్నబియ్యం, ఉచిత కరెంటు, సబ్సీడీ గ్యాస్, ఫ్రీ బస్సు వంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ తన ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తోంది. కేవలం హామీలకు పరిమితం అవ్వకుండా, వాటి అమలు ద్వారా తమది చేతల ప్రభుత్వం అని నిరూపించుకుంది. దీంతో స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, రహమత్‌నగర్, వెంగళరావు నగర్ వంటి డివిజన్ల వారీగా గత పదేళ్ల నుంచి పేరుకుపోయిన డ్రైనేజీ, వరద ముంపు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుండడం కాంగ్రెస్ పార్టీకి, నవీన్ యాదవ్‌కి కలిసొచ్చే అంశం.
మైనారిటీ, ఎంఐఎం మద్దతు
జూబ్లీహిల్స్‌లోని మొత్తం ఓటర్లలో అత్యధికంగా 34 శాతం ఉన్న మైనారిటీలు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు. ఇక్కడ ఎంఐఎంకు మంచి పట్టుంది. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై మైనారిటీ వర్గాలు సానుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఆయన ఎంఐఎం తఫున పోటీ చేయడం ద్వారా ఆ వర్గాలకు చేరువయ్యారు. అంతేకాకుండా, ప్రస్తుత ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సంపూర్ణ మద్దతు ప్రకటించడం నవీన్ యాదవ్‌కు ప్లస్ పాయింట్. ఎంఐఎం మద్దతుతో నియోజకవర్గంలో మెజారిటీ ఉన్న ముస్లిం ఓటర్లు నవీన్ యాదవ్‌కు వన్‌సైడెడ్‌గా ఓటు వేసే అవకాశాలు ఉండడంతో ఆయన విజయం నల్లేరుమీద నడక అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీసీ అస్త్రం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అగ్రవర్ణాలకు టిక్కెట్ కేటాయించగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీలకు టిక్కెట్ ఇచ్చింది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై విస్తృతమైన చర్చ జరుగుతున్న ఈ కీలక సమయంలో బీసీ సామాజిక వర్గానికి (యాదవ్) చెందిన నవీన్ యాదవ్‌కు కాంగ్రెస్ టికెట్ కేటాయించడం అత్యంత వ్యూహాత్మక నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు 1.40 లక్షల బీసీ ఓటర్లు (మొత్తం ఓట్లలో 35 శాతానికి పైగా) ఉన్నందున, బీసీల రాజకీయ సాధికారతకుతాము కట్టుబడి ఉన్నామనే సందేశాన్ని నవీన్ యాదవ్ అభ్యర్థిత్వం ద్వారా కాంగ్రెస్ చాటి చెప్పగలిగిందని అభిప్రాయపడుతున్నారు.
ఫోకస్ ఓన్లీ జూబ్లీహిల్స్..
రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన నేతలు సహజంగానే మరో నియోజకవర్గం వైపు పక్కచూపులు చూస్తుంటారు. కానీ, నవీన్ యాదవ్ మాత్రం నియోజకవర్గాన్ని వీడలేదు. రెండు సార్లు ఓడినా స్థానికంగానే ఉంటూ నవ యువ ఫౌండేషన్ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. యువతకు పోటీ పరీక్షల కోచింగ్ మొదలుకొని బాలింతలకు సీమంతం, పిల్లలకు అన్నప్రాసన వంటి సేవ కార్యక్రమాల ద్వారా సామాన్య ప్రజలకు చేరువయ్యారు. ఇది నిత్యం అందుబాటులో ఉండే నాయకుడిగా నవీన్ యాదవ్‌కు స్థానికంగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
వార్ వన్ సైడే..?
ఇన్ని సమీకరణాలు అనుకూలిస్తుండడంతో నవీన్ యాదవ్ తన అభ్యర్థిత్వం విషయంలో ఇతరులు వేలెత్తి చూపే అవకాశాన్ని ఇవ్వలేదు. నవీన్ యాదవ్ గతంలో పొందిన బలమైన ఓట్ల శాతాన్ని, అధికార పార్టీగా కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పనులను, ఎంఐఎం మద్దతుతో మైనారిటీ వర్గాల ఏకీకరణను, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సంధించిన బీసీ అభ్యర్థి అస్త్రాన్ని పరిగణలోకి తీసుకుంటే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ విజయం దాదాపు ఖాయమని, ఈ సమీకరణాలు కాంగ్రెస్ విజయానికి గట్టి పునాది వేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ALSO READ: జూబ్లీ కింగ్ ఎవరు..? ఎవరి గెలుపు శాతం ఎంత..?