CM Progress Report: ఈవారం సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ బిజీబిజీ మధ్య గడిచింది. యూరియా కొరత అధిగమించేందుకు కొత్త ప్లాన్, సర్కారు బడుల్లో చదివే పిల్లలకు రాగి జావ, ఎప్పటికప్పుడు యాప్ లోనే మిడ్ డే మీల్ బిల్లులు.., ఇంజరినీరింగ్ ఫీజులపై సర్కార్ కొత్త యాక్షన్ ప్లాన్, వీటికి సంబంధించి ఫుల్ డిటైల్స్ ఇప్పుడు చూద్దాం.
17-08-2025 ఆదివారం ( జల వివాదాల పరిష్కారం కోసం )
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్రం ఏర్పాటు చేయనున్న కమిటీకి నలుగురు సభ్యుల పేర్లను పంపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జులై 16న ఢిల్లీలో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి నేతృత్వంలో రెండు రాష్ట్రాల సీఎంలు సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఉన్న నదీ జలాల సమస్య పరిష్కారానికి సాంకేతిక, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటుకు ఆ సమావేశంలో నిర్ణయించారు. ఆ కమిటీకి సభ్యుల పేర్లపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. రాహుల్ బొజ్జా, ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ అంజద్ హుస్సేన్, అంతర్రాష్ట్ర జల విభాగం ఎస్‌ఈ సల్లా విజయ్‌కుమార్‌లను కమిటీ సభ్యులుగా సిఫార్సు చేయనున్నట్లు తెలిసింది. సో తెలుగు రాష్ట్రాల జలవివాదాలను పరిష్కరించే విషయంపైనే ఫోకస్ పెట్టారు.
18-08-2025 సోమవారం ( టీ-ఫైబర్ తో ఇంటింటికి ఇంటర్నెట్ )
టీ-ఫైబర్ పనులు జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్‌లో చేపట్టనున్న పనులపై సమగ్రమైన నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 18న అధికారులను ఆదేశించారు. టీ ఫైబర్ పనులు చేసిన కాంట్రాక్ట్ సంస్థలకు నోటీసులు ఇచ్చి పనులు చేసిన తీరుపై నివేదిక కోరాలని సీఎం ఆదేశించారు. టీ ఫైబర్ పై తన నివాసంలో సీఎం రేవంత్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి సమీక్ష నిర్వహించారు. సంస్థలో ఉద్యోగుల సంఖ్య, వారి పని తీరును సమీక్షించాలన్నారు. ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం కాువడంతో పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.
టీ ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రణాళిక ఉండాలని చెప్పారు. ఇప్పటి వరకు చేసిన ఖర్చు, పూర్తి కావడానికి అవసరమయ్యే నిధులు, వాటి సేకరణ, కార్యక్రమం విజయవంతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలను నివేదికలో పొందుపర్చాలన్నారు.
18-08-2025 సోమవారం ( బహుజనులకు న్యాయం కోసం )
బహుజనులు సమాజంలో ఎదగాలన్నా, నిలదొక్కుకోవాలన్నా చదువు ఒక్కటే మార్గమని సీఎం రేవంత్ అన్నారు. ఈనెల 18న ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్ భూమి పూజ చేశారు. బహుజనులు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.రవీంద్రభారతిలో సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి కార్యక్రమంలో సీఎం పాల్గొని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలని, అందుకే గుండెకాయ లాంటి సచివాలయం ఎదురుగా ట్యాంక్‌బండ్ పైన ఏర్పాటు చేస్తున్నామన్నారు. సర్దార్ పాపన్న గౌడ్ నిర్మించిన ఖిలాషాపూర్ కోటను చారిత్రక క్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.
19-08-2025 మంగళవారం ( యూరియా కోసం ఒత్తిడి )
తెలంగాణ రైతులకు అవసరం మేరకు యూరియాను వెంటనే సరఫరా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 19న కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేటాయించిన మేరకు రాష్ట్రానికి యూరియా సరఫరా చేయకపోవడంతో తలెత్తుతున్న సమస్యలను పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులకు ఇది వరకే వివరించామన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో తెలంగాణ రాష్ట్రానికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినప్పటికీ, ఇప్పటివరకు 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సప్లై అయిందన్నారు. రైతుల సమస్యలపై పార్లమెంట్ వేదికగా ఎంపీలు ఆందోళన సాగిస్తున్నప్పటికీ కోటా మేరకు యూరియా విడుదల చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆక్షేపించారు.
20-08-2025 బుధవారం ( సరికొత్తగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు )
ఆ సందర్భంగా భవన సముదాయాల నిర్మాణ సామగ్రిని సీఎం రేవంత్ పరిశీలించారు. ప్రజా పాలన – ప్రగతి బాట సభలో మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవం, మధ్య తరగతి ప్రజలకు రాజీవ్ స్వగృహ గృహ నిర్మాణం, నైట్ ఎకానమీని పెంచుతూ విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడానికి సంబంధించిన ప్రణాళికలను సమగ్రంగా వివరించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అపర్ణ గ్రూప్ 30 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ బిల్డింగ్ నిర్మాణానికి ముందుకొచ్చిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. మూసీని పునరుజ్జీవింపజేసి నైట్ ఎకానమీని పెంచాలని అనుకుంటున్నామని చెప్పారు.
20-08-2025 బుధవారం ( సరికొత్తగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు )
ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క. ఇదే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మన దగ్గర ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల కథ మరోలా ఉంటోంది. ఆదాయం ఎక్కువ ఇస్తున్న శాఖే అయినా.. ఆఫీసులు కిరాయి బిల్డింగ్ లలో ఉండడం, రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారికి సరైన వసతులు లేకపోవడం ఇలాంటి సమస్యలెన్నో ఎదురవుతున్నాయి. వీటిన్నిటిని దృష్టిలో పెట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటగా ఓఆర్ఆర్ లోపల ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను నిర్మించాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ వద్ద రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ భవనంతో పాటు ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ బిల్డింగ్ లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏటా 15 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సరైన కార్యాలయాలు లేకపోవడం సరికాదన్నారు. ఈ లోపాన్ని సరిదిద్దుతూ అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వసతులు పెంచడం వల్ల ప్రభుత్వానికి ఆదాయమే కాకుండా గౌరవం కూడా పెరుగుతుందన్నారు సీఎం.
21-08-2025 గురువారం ( ఇంజినీరింగ్ ఫీజులపై కొత్త ఫార్ములా )
ఇంజినీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజుల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీలు అందించే అకౌంట్స్‌తో పాటు ఆయా కాలేజీల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ను పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఫీజులు డిసైడ్ చేయాలన్నది. దీంతో ఫీజుల పెంపునకు సంబంధించిన రూల్స్ లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజినీరింగ్, వృత్తి విద్యా కాలేజీల్లో విద్యార్థుల హాజరు, ఫేషియల్ రికగ్నేషన్ అమలు, ఆధార్ ఆధారిత ఫీజుల చెల్లింపులు సహా స్టూడెంట్స్ ను రీసెస్చ్ వైపు ప్రోత్సహిస్తున్నారా లేదా అన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్టు సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాలేజీలు క్వాలిటీ విద్యను అందిస్తున్నాయా? ఆ కాలేజీల్లో విద్యార్థులకు ప్లేస్ మెంట్స్ ఎలా ఉన్నాయి అనే అంశాలపైనా ఫోకస్ పెట్టనున్నారు. జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్‌లు, ప్రభుత్వ రూల్స్ ను ఎంత వరకు అమలు చేస్తున్నారనే అంశాలను పరిశీలించిన తర్వాతే కాలేజీల్లో ఫీజులను నిర్ధరించనున్నారు.
22-08-2025 శుక్రవారం ( గ్రీన్ ఛానెల్ లో మిడ్ డే మీల్ బిల్లులు )
ప్రభుత్వ స్కూళ్లల్లో మధ్యాహ్న భోజనం వండిపెట్టే కార్మికుల బిల్లుల కష్టాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. ప్రతి నెల పదో తేదీలోపు గ్రీన్ ఛానెల్ ద్వారా బిల్లులను చెల్లించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపాక అమలు చేయనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 26 వేల స్కూళ్లలో 52 వేల మంది వంట కార్మికుల బిల్లుల సమస్యకు తెరపడుతుంది. ప్రతినెలా చివరిరోజు ఏ పాఠశాలలోని కార్మికులకు ఎంత చెల్లించాలన్నది బిల్లు వస్తుంది. దానికి హెడ్ మాస్టర్ ఆమోదం తెలపగానే… ఎంఈవో సరిచూసి ఓకే చెబితే చాలు… ట్రెజరీ ద్వారా బిల్లు మొత్తం 10వ తేదీలోపు కార్మికుల బ్యాంకు అకౌంట్లలో పడుతుంది. అందుకు అధికారులు ఎండీఎం యాప్‌ను రెడీ చేశారు. అప్పులు తెచ్చి భోజనం పెట్టాల్సి వస్తోందని కార్మికులు వాపోయిన సందర్భాలున్నాయి. ఈ మిడ్ డే మీల్ పథకానికి 10 నెలలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా కలిపి 540 కోట్లు ఖర్చవుతోంది. నెలకు దాదాపు 55 కోట్లు అవసరం. ఆ మొత్తం అడ్వాన్స్‌గా ఉంటేనే గ్రీన్ ఛానెల్ అమలు సాధ్యమవుతుంది.
23-08-2025 శనివారం ( యూరియా కొరతకు చెక్ పెట్టే ప్లాన్ )
తెలంగాణలో ప్రస్తుతం యూరియా కొరత తీవ్రంగా ఉంది. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి వేగంగా ఉత్పత్తి చేసే విషయంపై ఫోకస్ పెట్టింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ద్వారా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 1,69,325 టన్నుల యూరియా సప్లై చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 1,06,852 మెట్రిక్ టన్నులే వచ్చింది. ఇంకా 62,473 టన్నుల యూరియా రావాల్సి ఉంది. ఆగస్ట్ 14న అమ్మోనియా పైప్‌లైన్ లీకేజీతో ప్రొడక్షన్ ఆగింది. రిపేర్ అయి ఉత్పత్తి మొదలవ్వాలంటే మరో పది రోజులు పడుతుందంటున్నారు. దీంతో ఆ లోపు డిమాండ్ తక్కువగా ఉన్న జిల్లాల నుంచి ఎక్కువగా ఉన్న జిల్లాలకు యూరియా తరలించి, రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారును మంత్రి తుమ్మల ఆదేశించారు. ఈ విషయంలో కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ, రవాణాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు.
23-08-2025 శనివారం ( బడి పిల్లలకు రాగి జావ )
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు త్వరలో రాగి జావ అందించించేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకు ఆదేశాలిచ్చింది. శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ భాగస్వామ్యంతో రాగిజావ పంపిణీని గత రెండేళ్లుగా అమలు చేస్తుండగా.. అందుకయ్యే ఖర్చులో 40 శాతం భరించాలని ఆ ట్రస్ట్ ప్రతిపాదించింది. ఈ విషయంపై విద్యాశాఖ ఆలోచన చేసి తాజాగా 40 శాతం ఖర్చు భరించేందుకు ఓకే చెప్పింది. పిల్లలకు రాగిజావ అందించాలంటే ఏడాదికి 37 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం 14 కోట్లు తన వాటాగా ఇవ్వనుంది. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం వంట కార్మికులు రాగిజావను వండి పిల్లలకు అందిస్తున్నారు. ఆ పనికోసం వారు ముందుగా పాఠశాలలకు రావాల్సి వస్తోంది. దానికితోడు బెల్లంతో కూడిన రాగి పొడిని నీటిలో కలిపి వేడి చేయాలి. ఆ పనికయ్యే ఖర్చు రాలేకపోయింది. ఫైనల్ గా సర్కార్ ఓకే చెప్పడంతో పిల్లలకు బెనిఫిట్ జరగబోతోంది.
Story By Vidya Sagar, Bigtv