BC Reservations: బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. డోర్ టు డోర్ సర్వేకు అన్ని పార్టీలు అంగీకరించాయని అన్నారు. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం ప్రకారమే సర్వే జరిపామని చెప్పారు.
అసెంబ్లీ తీర్మానమే ప్రజల అభిప్రాయంగా..
అసెంబ్లీ తీర్మానాన్ని ప్రజల అభిప్రాయంగా చూడాలని ఏజీ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. సర్వేలో బీసీ జనాభా 57.6 శాతంగా తేలిందని అన్నారు. సర్వే డేటా ఆధారంగానే రిజర్వేషన్లు ఫిక్స్ చేసినట్టు వాదించారు. బీసీల సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషనర్లకు రిపోర్టు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలోనే బిల్లు నెంబర్ 4 కాపీని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు సమర్పించారు.
బిల్లు పంపి 6 నెలల పూర్తి అయినందునే..
బిల్లుపై ఒక పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదని అన్నారు. మార్చి నెల నుంచి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లోనే ఉందని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం బిల్లు పంపి 6 నెలలు పూర్తి అయినందున బిల్లుకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్టే భావిస్తున్నామని అన్నారు. దీనిపై ప్రత్యేక నోటిఫికేషన్ ఏం అవసరం లేదని పేర్కొన్నారు. ‘జులై 10న ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. జులై 26న ప్రెసిడెంట్ కు పంపారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు.. లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు వేరు’ అని అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ALSO READ: Telangana Politics: స్థానిక సంస్థల ఎన్నికలు.. జూమ్ మీటింగ్‌లో సీఎం రేవంత్, క్లీన్ స్వీప్‌పై ఫోకస్
ఇంది సహానీ కేసు ఏం చెబుతోంది..?
ఇందిరా సహానీ కేసు విద్య, ఉద్యోగాలకు సంబంధించినదని అడ్వొకేట్ జనరల్ వాదించారు. ఇది లోకల్ బాడీ ఎన్నికలకు వర్తించదని తన వాదనలు వినిపించారు. బిల్లుపై ఇతర ఏ పార్టీలు కూడా ఎలాంటి అభ్యంతరం తెలపలేదని ఆయన మరోసారి గుర్తుచేశారు.