Local Body Elections: సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే విధించింది. జీవో నంబర్ 9పై తెలంగాణ హైకోర్టు స్టే ఇస్తూ తీర్పునిచ్చింది. అడ్వొకేట జనరల్ సుదర్శన్ రెడ్డి చాలా సేపు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినప్పటికీ హైకోర్టు స్టే ప్రకటిస్తూ తీర్పును ఇచ్చింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేస్తూ తీర్పును ఇచ్చింది…
న్యాయ నిపుణులతో ఎస్ఈసీ సంప్రదింపులు..
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ప్రభుత్వానికి 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.. అలాగే 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆర్డర్ కాపీ వచ్చాక ఎన్నికల సంఘ నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం న్యాయ నిపుణులతో రాష్ట్ర ఎన్నికల కమీషన్ సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
ఏ పార్టీ కూడా అభ్యంతర తెలపలేదు.. ఏజీ
గత రెండు రోజుల నుంచి బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో వాదోపవాదనలు జరగుతున్న విషయం తెలిసిందే.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఈ రోజు క్లియర్ కట్ గా వాదనలు వినిపించారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని.. ఏ పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదని వాదించారు. స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలో మాత్రమే జరిగిందని వివరించారు. ఇంటింటికెళ్లి సర్వే చేశామని గుర్తు చేశారు. సర్వే పై ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టుకు ఆయన వివరించారు. స్థానిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత న్యాయస్థానాల జోక్యం ఉండబోదని తెలిపారు.. ఈ అంశాన్ని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసినట్లు హైకోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు.
రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని ఎక్కడా లేదు..
ప్రభుత్వం తరఫున మరో సీనియర్ న్యాయవాది రవివర్మ కుమార్ వాదనలు విన్పించారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని ఎక్కడా లేదన్నారు. ప్రత్యేక సందర్భాల్లో 50 శాతం క్యాప్ మించవచ్చని సుప్రీం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారాయన. తెలంగాణలో ఏ రిజర్వేషన్లు లేని వాళ్ల జనాభా 15 శాతం మాత్రమేనన్నారు రవి వర్మ. కేవలం 15 శాతం ఉన్న వారు బీసీ రిజర్వేషన్లను ఎలా ఛాలెంజ్ చేస్తారని కోర్టు ముందు తమ వాదనలు విన్పించారు. రిజర్వేషన్లు పరిమితి దాటాయన్న వాదనలు సరికాదన్నారు రవి వర్మ. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చినా ఓసీలకు 33 శాతం సీట్లు ఉంటాయన్నారు. ఈ క్రమంలోనే ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసును ప్రస్తావించారు రవి వర్మ. అంతేకాదు.. ఓటు వేయడం ఎన్నికల్లో పోటీ చేయడం ప్రాథమిక హక్కులు కాదన్నారు. అలాంటప్పుడు ఎన్నికల్లో రిజర్వేషన్లను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు రవివర్మ.
బీసీ సంఘాలు ఆందోళన..
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టు వద్ద బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. హైకోర్టు గేట్ 4 దగ్గర బీసీ సంఘాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.
ALSO READ: BC Reservations: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ.. అడ్వొకేట్ జనరల్ ఏమన్నారంటే..?