హుజూర్ నగర్ లో అద్భుత విజయం
2018 ఎన్నికల తర్వాత తెలంగాణలో తొలి ఉపఎన్నిక హుజూర్ నగర్ లో జరిగింది. ఈ ఉపఎన్నికలో
43 వేలపైగా ఓట్ల భారీ తేడాతో జయభేరి మోగించి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 2018 సాధారణ ఎన్నికల్లో హుజూర్ నగర్ లో కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు . ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ కు మెజార్టీ వచ్చింది. ఆ వెంటనే జరిగిన ఉపఎన్నికకు వచ్చే సరికి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎంపీగా ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన స్థానంలో భార్య పద్మావతిని బరిలోకి దించారు. అయినా సరే టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ విజయం సాధించారు.
దుబ్బాకలో తొలి దెబ్బ
2018 ఎన్నికల్లో దుబ్బాకలో బీజేపీ 3 స్థానంలో నిలిచింది. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 14 శాతం ఓట్లు తెచ్చుకున్నారు. ఉపఎన్నికలోనూ తిరిగి రఘునందన్ రావునే బీజేపీ బరిలోకి దించింది. టీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సుజాత బరిలోకి దించినా గెలవలేకపోయింది. కానీ టీఆర్ఎస్ , బీజేపీ మధ్య ఉత్కంఠ పోరు నడిచింది. కేవలం వెయ్యి ఓట్లు మెజార్టీతో బీజేపీ అభ్యర్థి గెలిచారు.
హుజురాబాద్ లో ఈటల మార్క్
హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల-టీఆర్ఎస్ మధ్యే పోరు నడిచిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ఉన్నారు. ఈటల బీజేపీ నుంచి బరిలోకి దిగినా తన మార్కు రాజకీయంతోనే గెలిచారు. ఈ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ 23వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు.
నాగార్జున సాగర్ లో కారుజోరు
వరసగా రెండు ఉపఎన్నికల్లో దెబ్బతిన్న టీఆర్ఎస్ నాగార్జునసాగర్ లో భారీ విజయం సాధించింది. ఈ ఉపఎన్నికలో మాత్రం టీఆర్ఎస్ కు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఎందుకంటే ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి బరిలోకి దిగడంతో నాగార్జునసాగర్ ఎన్నికపై ఆసక్తి మరింత పెరిగింది. అయితే జానారెడ్డి 18వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలిచారు.
మునుగోడులో అదో జోరు
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జరిగిన ఐదో ఉపఎన్నికలో టీఆర్ఎస్ నే విజయం వరించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఉపఎన్నిక కారు స్పీడ్ ను పెంచేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన 5 ఉపఎన్నికల్లో 3 టీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చాయి. అందులో రెండు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలే.
తెలంగాణలో జరిగిన ఐదు ఉపఎన్నికల్లో దుబ్బాక, హుజురాబాద్, మునుగోడులో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. ఈ మూడు స్థానాల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితమైంది. హుజుర్ నగర్ , నాగార్జున సాగర్ లో మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ నడిచింది. నాగార్జునసాగర్, హుజూర్ నగర్ ఉపఎన్నికలో బీజేపీకి డిపాజిట్ దక్కలేదు. 5 ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ 3 విజయాలు నమోదు చేసింది. బీజేపీ రెండు చోట్ల గెలిచింది.
సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన కాంగ్రెస్
2018 ఎన్నికల్లో హుజూర్ నగర్, మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఈ రెండు సిట్టింగ్ స్థానాలను కాంగ్రెస్ కోల్పోయింది.
1 నుంచి 3 చేరిన బీజేపీ బలం
2018 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒక్కస్థానంలో మాత్రమే గెలిచింది. కాషాయ పార్టీ నుంచి రాజాసింగ్ ఒక్కరే విజయం సాధించారు. ఉపఎన్నికల వల్ల ఆ పార్టీ బలం 3కు చేరింది.