Say No To Chinese Manja: గత కొన్నేళ్లుగా ‘చైనా మాంజా’ (నైలాన్/సింథటిక్ దారం) రూపంలో ఒక మృత్యుపాశంవెంటాడుతోంది. ఈ ఏడాది కూడా తెలంగాణలో చైనా మాంజా బీభత్సం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అవధేష్ కుమార్ (38) అనే వలస కార్మికుడు బైక్‌పై వెళ్తుండగా ఫసల్వాది వద్ద చైనా మాంజా మెడకు చుట్టుకుని గొంతు కోసుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద సాయివర్ధన్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మెడకు మాంజా తగిలి లోతైన గాయమైంది. అలాగే గచ్చిబౌలిలో మరో ఇంజనీర్ చైతన్య చేయికి తీవ్ర గాయాలయ్యాయి. విధి నిర్వహణలో ఉన్న నల్లకుంట ఏఎస్ఐ నాగరాజు గొంతుకు మాంజా చుట్టుకుని 10 కుట్లు పడ్డాయి.
ఈ నేపథ్యంలోనే టీజీఎస్ఆర్టీసీ ఎండి వి.సి. సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజలకు అప్రమత్తం చేశారు. సంక్రాంతి సంబరాల వేళ.. ఆనందోత్సాహాల నడుమ ఉండాల్సిన ఎన్నో కుటుంబాల్లో నిషేధిత ‘చైనా మాంజా’ తీరని విషాదాన్ని మిగిల్చింది. నింగిలోకి గాలిపటాన్ని పంపి మురిసిపోవడమే కాదు.. చేతిలోని ఆ ప్లాస్టిక్ దారం దారినపోయే వారి పాలిట యమపాశంలా మారుతోందన్న కనీస స్పృహ ఉండక్కర్లేదా? అని వి.సి. సజ్జనార్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
మనుషులకే కాదు, మూగజీవాలకు ముప్పు అని, పదునైన మాంజా దారానికి రెక్కలు తెగి విలవిల్లాడుతున్న పక్షుల పరిస్థితి తనను కలచివేస్తోందని ఆయన అన్నారు. అమ్మేవారే కాదు, కొనేవారూ బాధ్యులే అన్నారు. నిషేధం ఉన్నా దొంగచాటుగా అమ్మేవారెంత నేరస్తులే.. తెలిసి కూడా వాటిని కొని పదిమంది ప్రాణాలతో చెలగాటమాడేవారూ అంతే బాధ్యులని ఆయన స్పష్టం చేశారు.
“క్షణకాలం ఆనందం కోసం అమాయకుల ప్రాణాలు తీస్తారా? ఆసుపత్రుల పాలైన వారికి, అసువులు బాసిన వారికి ఎవరు జవాబుదారీ?” అని ప్రశ్నించారు. “బాధితుల కుటుంబాల్లోని ఆర్తనాదాలు ఒక్కసారి వినండి.. వారి ఆవేదనను మీదిగా భావించండి. ఇప్పటికైనా చైనా మాంజాను విడనాడండి.. సాటి మనుషుల పట్ల బాధ్యతగా మెలగండి.” అని సజ్జనార్ హితవు పలికారు.
పోలీసుల నిఘా, #SayNoToChineseManja ప్రచారం, పోలీసుల ప్రత్యేక తనిఖీల వల్ల ఈసారి ప్రమాదాలు గణనీయంగా తగ్గాయన్నారు. ఈ నిఘా ఏడాదంతా కొనసాగుతుందని, దాడులు నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే ఏడాదికి ఒక్క ప్రమాదం కూడా జరగకూడదన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Read Also: MLA Disqualification Case: ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సీరియస్.. స్పీకర్‌కు చివరి అవకాశం!