
Venkaiah Naidu news(Today’s news in telugu): తన జీవితంలో అవార్డులు, సన్మానాలు పెద్దగా తీసుకోలేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పద్మవిభూషణ్ పురస్కారం ఇస్తున్నట్లు కేంద్రం చెబితే ప్రధాని మోదీపై గౌరవంతో అంగీకరించానని పేర్కొన్నారు. పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని శిల్పకళావేదికలో తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి సన్మానం చేయడం గొప్ప విషయమని వెంకయ్య నాయుడు అన్నారు. అందుకు సీఎం రేవంత్‌ని అభినందిస్తున్నానని పేర్కొన్నారు. గుర్తింపు పొందని వ్యక్తులకు పద్మ అవార్డులు ప్రకటించారు. మట్టిలో మాణిక్యాలను గుర్తించి ఈ పురస్కారాలు ఇవ్వడం గొప్ప విషయమన్నారు.
రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. దీన్ని సరిదిద్దాల్సిన కర్తవ్యం మనందరిపైన ఉందన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు విలువలు పాటించాలన్నారు. తెలుగు కళామతల్లికి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు అయితే చిరంజీవి మూడో కన్ను అని కొనియాడారు. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధ్యమే అని చెప్పారు.