Big Stories

Munugode Result : బీజేపీ ఓటమికి కారణాలివే!.. కమల కల్లోలం..

Munugode Result : మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ ఎందుకు ఓడిపోయింది? రాజగోపాల్ రెడ్డి లాంటి బలమైన అభ్యర్థి ఎందుకు గెలవలేకపోయారు? అతి విశ్వాసమే కాషాయ పార్టీ కొంపముంచిందా? రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసమే బీజేపీకి అమ్ముడుపోయారనే ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారా? ఈ ప్రశ్నలే ఇప్పుడు కమలనాథులకు ఎదురవుతున్నాయి.

- Advertisement -

మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డి పరాజయం… వ్యక్తిగతంగా పరిగణించాలా.. లేక పార్టీకి ఆపాదించాలా..? ఇదే ఇప్పుడు పార్టీ వర్గాలతో పాటు.. విశ్లేషకుల ముందున్న ప్రశ్న. మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెండు నెలల క్రితం కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కాకముందే మునుగోడులో బీజేపీ అభ్యర్థి ఎవరో తేలిపోయింది. రాజగోపాల్ రెడ్డికి నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. చాలావరకు కాంగ్రెస్ క్యాడర్ ను తనవైపు తిప్పుకున్నారు. టీఆర్ఎస్ నుంచి కొంత మంది నేతలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇలా ఉపఎన్నికకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. అయినా సరే ఓటమిని మూటగట్టుకున్నారు.

- Advertisement -

మనుగోడులో బీజేపీ ఓటమికి ప్రధాన కారణం… క్షేత్రస్థాయిలో పార్టీకి సొంత క్యాడర్ లేకపోవడమే. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుల కొరత ఉంది. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత ఛరిష్మా, అంగ, అర్థ బలాలు తప్ప.. బీజేపీకి చెప్పుకోదగ్గ కేడర్ లేదు. నిజానికి ఏ ఎన్నికకు అయినా బూత్ స్థాయిలో పోల్ మేనేజ్ మెంట్ అనేది చాలా ముఖ్యం. బీజేపీకి ఈ బలం లేకపోవడం మైనస్ గా మారింది. మరోవైపు ప్రత్యర్థి అయిన టీఆర్ఎస్ ఈ విషయంలో ఎంతో ముందుంది. స్థానిక కేడర్ సహాయంతో పోల్ మేనేజ్ మెంట్ చేయడంలో సఫలమైంది. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులివ్వడంలేదని ఆరోపించారు. కానీ తాను తిరిగి గెలిస్తే ఏం చేస్తాననే విషయం ఓటర్లకు చెప్పలేకపోయారు.

ఇక రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడగానే అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు సంధించాయి. కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరారని ప్రచారం చేశాయి. ఉపఎన్నిక ప్రచారం సమయంలో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పెట్టిన పోస్టర్లు కలకలం రేపాయి. రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయారంటూ టీఆర్ఎస్ బలంగా చేసిన ప్రచారం ఫలించిందని తాజా ఫలితాన్ని బట్టి అర్థమవుతోంది.

వీటన్నిటికీ మించి హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన ఎమ్మెల్యేల ఎర వ్యవహారం మునుగోడు ఉపఎన్నికపై స్పష్టమైన ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపణలు రావడంతో రాజకీయం మరింత హీటెక్కింది. ఎమ్మెల్యేల ఎర వ్యవహారం తర్వాత మునుగోడులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొన్నాల్సిన సభ రద్దైంది. ఎందుకనేది ఎవరికీ అర్ధంకాని ప్రశ్నగా మిగిలిపోయింది. అప్పటి వరకు దూకుడుగా ప్రచారం చేసిన బీజేపీ ఆ తర్వాత ఎందుకో ఆ స్థాయి దూకుడును ప్రదర్శించలేకపోయింది. ఉపఎన్నిక దగ్గర పడుతున్నా కొద్ది బీజేపీ కొంచెం పట్టు సడలించినట్లే కన్పించింది. మొత్తంగా 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన మునుగోడు ఉపఎన్నిక కాషాయ పార్టీకి తేరుకోలేని షాక్ ఇచ్చింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News