Big Stories

Amaralingeswara Temple : ఇంద్రుడు పూజించిన దైవం.. అమర లింగేశ్వరుడు!

Amaralingeswara Temple

Amaralingeswara Temple : తెలుగునేల మీద పరమశివుడు.. అమరారామము, కొమరారామము, భీమారామము, ద్రాక్షారామము, క్షీరారామములలో అనే పంచారామ క్షేత్రాల్లో కొలువై పూజలందుకుంటున్నాడు. వీటిలో మొదటిదైన అమరారామం గుంటూరు జిల్లాలో ఉంది. దీనినే నేడు అమరావతి అంటున్నారు. కృష్ణా తీరంలోని అమరావతి బౌద్ధము, జైనమతాలకూ గొప్ప కేంద్రంగా విలసిల్లింది.

- Advertisement -

అమరావతిలో పరమేశ్వరుడు.. అమరలింగేశ్వర స్వామిగా పూజలందుకుంటాడు. అమ్మవారు రాజ్యలక్ష్మీ దేవి. కృష్ణా నదిని ఆనుకుని 5 ప్రాకారాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడి ఆలయంలోని శివలింగం ఎత్తు 15 అడుగులు. ఈ లింగం రోజురోజుకూ పెరుగుతుండటంతో లింగం తలపై ఓ మేకును కొట్టారనీ, నాటి నుంచి దాని పెరుగుదల ఆగిందనీ, ఆ తర్వాతే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. దీనికి రుజువుగా నేటికీ ఆ మేకు, దానిని కొట్టినప్పుడు కారిన నెత్తుటి చారలు స్పష్టంగా కనిపిస్తాయి. శివలింగం ఎత్తుగా ఉండటంతో పక్కన కట్టిన మెట్లమీద ఎక్కి అర్చకులు అభిషేకం చేస్తారు.

- Advertisement -

అమరావతికి ఒక పురాణ కథ ప్రకారం.. అహల్యను మోహించి శాపగ్రస్తుడైన దేవేంద్రుడు ఆ పాపాన్ని పోగొట్టుకోవటం కోసం ఇక్కడి కృష్ణాతీరంలో స్నాచమాచరించి, ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు. అమరుడు(ఇంద్రుడు) ప్రతిష్ఠించిన కారణంగానే దీనికి అమరావతి అనే పేరువచ్చిందని పురాణ కథనం.

క్రీ.శ 1517లో కొండవీటి రెడ్డిరాజులపై విజయం సాధించిన తర్వాత విజయనగర పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు అమరావతిని సందర్శించి ఇక్కడి అమరేశ్వరునికి నైవేద్య మహాపూజలు నిర్వహించినట్టు, పెదమద్దూరు గ్రామ పంటభూముల్ని ఆలయానికి దానమిచ్చాడట. ఆ సందర్భంగా రాయలు ఇక్కడ బంగారంతో తులాభారం తూగి, ఆ బంగారాన్ని పేదలకు పంచిపెట్టాడట. రాయలు తన భార్య చిన్నాదేవి చేత కృష్ణానదీ తీరాన రత్నధేను మహాదానం, మరో భార్య తిరుమల దేవి చేత సప్తసాగర మహాదానం చేయించాడు. ఈ వివరాలన్నీ ఇక్కడి ఆలయపు దక్షిణ ప్రాకారంలోని రాయల తులాభార మండపంలోని రాజశాసనంలో వివరంగా పొందుపరచారు.

ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధాని యైన ధాన్యకటకం. అదే ధరణికోట. ఇది అమరావతికి ఉత్తరాన ఉన్న ఈ గ్రామానికి బౌద్ధమత చరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. దీనినే అప్పట్లో ‘ఆంధ్రపురి’ అని పిలిచేవారు. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకు రాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్ర దుర్గాలలో ఈ 16 కి.మీ చుట్టుకొలత గల నగరమూ ఉంది. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4 – 3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపదం)గా ఉన్నట్టు అధారాలున్నాయి.

బుద్ధుని జీవితకాలము నుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. దీనికి రుజువుగా గొప్ప బౌద్ధ స్థూపం నేటికీ అమరావతి మ్యూజియంలో ఉంది. 1797 లో కల్నల్ కోలిన్ మెకంజీ దీపాలదిన్నెగా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్విన సమయంలో ఇది బయటపడింది. అప్పటికే ఆ మహాచైత్యం అంతా కూలిపోయి 90 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తుగల ఒక దిబ్బలాగా మిగిలింది. ఇక్కడ దొరికిన ఎన్నో శిల్పాలను మద్రాస్ గవర్నమెంట్ మ్యూజియం, చెన్నై, లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News