హైదరాబాద్ నగరంలో నకిలీ నోట్ల చలామణి చేస్తున్న ముఠా కలకలం రేపింది. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా నకిలీ కరెన్సీ బయటపడింది. ఏకంగా రూ. 42 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఈ దందాకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే?
విశ్వసనీయ సమాచారం మేరకు గుడిమల్కాపూర్ పోలీసులు రైతిబోలి సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఒక వాహనాన్ని ఆపి సోదా చేయగా, అందులో కట్టల కొద్దీ నకిలీ నోట్లు దర్శనమిచ్చాయి. రూ. 500 నోట్ల కట్టలతో ఉన్న సుమారు రూ. 42 లక్షల విలువైన ఈ నోట్లను చూసి పోలీసులు విస్తుపోయారు. వెంటనే ఆ నోట్లను స్వాధీనం చేసుకుని, వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ముఠా మూలాలపై ఆరా..
పట్టుబడిన నిందితులను రహస్య ప్రాంతానికి తరలించి పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు. ఈ నకిలీ నోట్లను ఎక్కడ ముద్రిస్తున్నారు? వీటిని ఎక్కడి నుండి తీసుకువచ్చారు? నగరంలో ఎవరికి సరఫరా చేయాలని చూస్తున్నారు? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఈ వ్యవహారం వెనుక అంతర్రాష్ట్ర ముఠాల హస్తం ఉందా లేక స్థానికంగానే ఎవరైనా ల్యాబ్ ఏర్పాటు చేసి నోట్లను ముద్రిస్తున్నారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
సాధారణ ప్రజలు, వ్యాపారులు నకిలీ నోట్లను గుర్తించలేనంత పక్కాగా వీటిని ముద్రించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రద్దీగా ఉండే మార్కెట్లు, పెట్రోల్ బంకులు, మద్యం దుకాణాలను ఈ ముఠా లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఈ నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించింది? అనే విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
నగరంలో నకిలీ నోట్ల చలామణి పెరిగే అవకాశం ఉన్నందున, ప్రజలు నగదు లావాదేవీల సమయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పెద్ద నోట్లను తీసుకునేటప్పుడు ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం సెక్యూరిటీ ఫీచర్లను సరిచూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. నిందితుల ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఈ ముఠా మూలాలను వెలికితీసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
ALSO READ: EPFO New Rules: బ్యాంక్ అకౌంట్‌లా మారనున్న ఈపీఎఫ్, యూపీఐ పిన్‌తో క్షణాల్లో నగదు బదిలీ