కేంద్రం హడావుడిగా తనకు కావాల్సిన విధంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపడుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఇందులో సాకుగా చూపి.. లోక్‌సభ, అసెంబ్లీ నియోజవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ హడావుడిగా ప్రత్యేక పార్లమెంటు సెషన్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దీనిపైనా అంతా చర్చ జరుగుతోంది.
సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రం విధానాన్ని ఎండగట్టారు. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసే ఈ బిల్లును ఆమోదించవద్దని, దక్షిణాది రాష్ట్రాల మద్దతు కూడగట్టి .. దీనిపై పోరాడుతామని ప్రకటించారు. అసమానతలు పెంపొందించే విధంగా, చిన్న రాష్ట్రాలకు, జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలకు సీట్ల పెంపులో తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఇది కేంద్రంలోని బీజేపీ తన రాజకీయ లబ్ది కోసమే దేశాన్ని ఆగం చేసే విధంగా చర్యలకు దిగుతున్నదని రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఓ వైపు మహిళా బిల్లు విషయంలో కూడా ఓబీసీల ప్రస్తావన లేకుండా ఆమోదింపజేసేందుకు ప్రయత్నం చేయడం ఒకటైతే.. దీంతో పాటే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌ను చేయాలని కేంద్రం భావిస్తోంది.
దీని ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగడంతో పాటు దేశ రాజకీయాల్లో తెలంగాణకు పట్టులేకుండా పోతుంది. ఇక్కడి నుంచే అత్యధిక పన్నులు రాబడుతున్న కేంద్రం.. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా తీరని అన్యాయం చేయ్యడానికి సిద్దమైందన్న సీఎం.. జీఎస్‌డీపీ ఆధారంగా సీట్ల విభజన జరగాలని డిమాండ్ చేశారు. దీనిపై మలిదశ తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాడుతామని కూడా ప్రకటించారు.
ఇంత జరుగుతున్నా ఈ విషయంలో బీఆరెస్ సైలెంట్‌గా ఉన్నది. తెలంగాణకు లోక్‌సభ సీట్లు తక్కువున్నందునే.. పక్క రాష్ట్రం మహారాష్ట్రపై కేసీఆర్ కన్నేసిన విషయం తెలిసిందే. అందుకే దీనికోసం ప్రత్యేకంగా తన పార్టీలోని తెలంగాణ పేరునే ఎత్తేశారు. బీఆరెస్ అని పార్టీ పేరును నామకరణం చేసుకుని మహారాష్ట్రకు మన నిధులు తరలించి పార్టీ కార్యక్రమాలు చేపట్టారు. కానీ కాలం కలిసి రాలేదు. ఇక్కడ తెలంగాణలోనే అధికారంలోకి రాక ఆ పార్టీ చతికిలబడింది. ఆ తరువాత కూడా బీఆరెస్‌ను మార్చలేదు.
టీఆరెస్‌గా మార్చితే నామోషీ అనుకున్నారో.. మళ్లీ దేశంలో చక్రంతిప్పేందుకు , దేశ రాజకీయాలు మార్చేందుకు చాన్స్ దొరుకుగుతుందనుకున్నారో తెలియదు కానీ.. డీలిమిటేషన్ అంశం కీలకదశకు వస్తున్నా. తండ్రీ, కొడుకులిద్దరూ మాట్లాడటం లేదు. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారు. ఇలాంటి కీలక సమయాల్లో కూడా ఓ ప్రెస్‌నోట్ కూడా ఆయన విడుదల చేయకపోవడం గమనార్హం.
కేటీఆర్ సైతం దేశ రాజకీయాల జోలి మనకెందుకులే అన్నట్టుగానే.. ఢిల్లీ నుంచి గల్లీ లెవల్ ఆలోచనలకు పరిమితమైనట్టుగా చెల్లె రాజకీయాలను తట్టుకుని నిలబడేందుకే వారికి సమయం సరిపోవడం లేదనే విధంగానే ప్రవర్తిస్తున్నారు. బీఆరెస్‌ను టీఆరెస్‌గా మార్చుకునే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా కేటీఆర్ అన్నారనే వార్తలొస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఇక దేశ రాజకీయాలు అవసరం లేదు.
కానీ ఇక్కడ సమస్య వీరు దేశ రాజకీయాలను ఏలుతారని కాదు.. అప్పడంత సీన్ లేదనిదీ కాదు. తెలంగాణకు డీలిమిటేషన్ కారణంగా ఘోరమైన నష్టం జరగనుంది. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే.. కుటుంబ నియంత్రణ అంటూ చాలా ఏళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాలు జనాభాను నియంత్రించాయి. ఇతర రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు. ఉత్తర భారత దేశంలో జనాభా ఎక్కువగా ఉండి , జనాభా కూడ నియంత్రణలో లేని చోట్ల పెరిగిన ఉన్న సీట్లకు మరింత పెంపు.. పెంపుదల లేని తెలంగాణ లాంటి రాష్ట్రాలకు అత్తెసరు సీట్ల పెంపుతో తీవ్ర అసమానతలను సృష్టించడమే అవుతుంది.
ఇప్పుడు కేంద్రం ఇదే చేస్తున్నది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తూ వస్తోంది కేంద్రం. పైసలు మనమే ఎక్కువ కట్టాలె.. సలాం కొట్టాల్నా.. సీట్ల నెంబరే మన దగ్గర లేనప్పుడు మనల్ని పట్టించుంటారా? అని సీఎం రేవంత్‌రెడ్డి అసలు విషయాన్ని లేవనెత్తారు. జీఎస్‌డీపీ ఆధారంగానే సీట్ల విభజన జరగాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై పోరాటాలకు సిద్దమవుతున్నట్టు ప్రకటించారు. దేశం కోసం, రాష్ట్ర ప్రజానీకం కోసమే మేము అన్నట్టుగా మాట్లాడిన బీఆరెస్ మాత్రం ఈ క్లిష్ట సమయంలో మౌన ముద్ర వహించడం చర్చనీయాంశమైంది.