మంగ్లీ చాలా తక్కువ కాలంలోనే సెలబ్రిటీ అయ్యింది. దాన్ని అదృష్టం అనడం కంటే ఆమెకున్న టాలెంట్‌తోనే అని చెప్పాలి. తనకున్న ప్రతిభతో, స్వయంకృషితో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ వచ్చింది. ఓ టీవీలో మంగ్లీగా ఆమె తన సహజ సిద్ధమైన గిరిజన వేషధారణలో పక్కా తెలంగాణ యాసను ఔపోసన పట్టి .. సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకున్నది. తమ పక్కంటి అమ్మాయిలాగే ముచ్చట్లు పెట్టేది. అమాయకమైన ముఖ వర్చస్సు, కల్మషం లేని నవ్వు, అందరినీ ఆకట్టుకునే మాట తీరు.. ఆమెను తక్కువ కాలంలోనే అన్ని వర్గాలకు దగ్గర చేసింది. అప్పటికే ఆమె ఎదుగుదలను జీర్ణించుకోలేని కొంత మంది ఆమె తెలంగాణకు చెందినది కాదని, ఆంధ్ర అమ్మాయని వేరుగా చూసేందుకు ప్రయత్నం చేసినా.. ఆమె ప్రతిభ ఆమెను ప్రాంతాలకతీతంగా ఎదిగేలా చేసింది.
ఓ వేదికగా రాణించి, తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న మంగ్లీ ఆ తరువాత తన విభిన్నమైన గాత్రంతో, డ్యాన్స్‌తో ఆకట్టుకున్నది. తనకంటూ ఓ ప్రత్యేక ప్రపంచాన్నే క్రియేట్ చేసుకోగలిగింది. అందరికీ తలలో నాలుకలో ఉండే ఆమెకు మద్దతు కూడా అలాగే లభించింది. అందరి సలహాలు, సహకారంతో ఆమె ఎదుగుతూ వచ్చింది. ఈ క్రమంలో వివాదాలకూ దగ్గరవుతూ వచ్చింది. వార్తల్లో కేంద్రబిందువుగా నిలుస్తూ వస్తోంది. ఆమె చెల్లె ఇంద్రావతి చౌహాన్‌ను పరిచయం చేసేందుకు కూడా ఆమె ఉత్సాహం చూపింది.
చెల్లె.. మంగ్లీ అంతలా వెలుగులోకి రాలేకపోయింది. అందంలోను, గాత్రంలోనూ మంగ్లీతో పోటీ పడలేకపోయింది. మంగ్లీ సక్సెస్‌ఫుల్ యాత్ర కొనసాగిస్తూనే ఉంది. స్టేజ్ షోలతో ప్రత్యేకతను చాటుకున్నది. రాజకీయంగా స్టాండ్ తీసుకునే క్రమంలో వివాదాలు ఎదుర్కొన్నది. వైఎస్ జగన్ పార్టీకి సపోర్టు చేసిందని, చంద్రబాబుకు పాట పాడమన్నా పాడలేనదే ఆరోపణల నేపథ్యంలో ఆమెపై పార్టీల తరుపున మాటల దాడులు కూడా జరిగాయి.
ఇలా ఏదో ఒక రూపంలో ఆమె వార్తల్లో కేంద్ర బిందువవుతూ వస్తోంది. అప్పటికే ఆమె జాగ్రత్త పడాల్సిన అనివార్యత ఉందనే సంకేతాలు పలు సంఘటనల ద్వారా అందినా .. ఆమె నిర్లక్ష్యమే వహించిందనే చెప్పాలి. చెప్పేవారు లేకనా? అంత సమయం లేకనా? వాటిని పెద్దగా పట్టించుకోకపోవడమా? సెలబ్రిటీగా ఎదిగే క్రమంలో ఇవన్నీ కామాన్ అని లైట్ తీసుకోవడమా? ఏమైనా కావొచ్చు.. కానీ క్రమక్రమంగా మానిసకంగా క్షోభకు గురయ్యే దుస్థితిని మాత్రం కొని తెచ్చుకుందనేది వాస్తవం.
దీనికి కారణం ఎవరో కాదు.. ఆమె స్వయంకృతాపరాధం మూలంగానే ఇంతా జరిగిందనడంలో తప్పులేదు. తన పుట్టిన రోజు వేడుక కోసం ఆమె ఓ ఫామ్‌హౌజ్‌లో చేసిన హంగామా బజారుకెక్కింది. అందులో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణ మంగ్లీ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్‌ను తగ్గించేలా చేసింది. ఇది మొదలు ఆమె అడపాదడపా వార్తల్లోకెక్కుతూనే ఉన్నది.
మంగ్లీ వందల కోట్ల కుంభకోణంలో పాత్రదారి అంటూ సుబ్బారావు అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం.. ఆమెపై కేసులు నమోదు కావడంతో వివాదం మరీ ముదిరి.. మంగ్లీ కంటనీరు పెట్టుకునే దాకా వచ్చింది. తనకు ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్న ఆమె… ఇలాంటి వార్తలు రాసే ముందు కనీసం ఆలోచించరా..? నా తల్లిదండ్రులు ఏమైపోతారో కూడా ఆలోచించరా అని ఆమె కంటతడి పెట్టుకోవడం నిజంగా విషాదమే. నేను ఇంతలా సంపాదిస్తున్నాను.. ఇంత బిజీగా ఉన్నాను… కానీ అక్రమ సంపాదన, కేసులు పాలు కావడం అవసరమా? అని కూడా ఎదురు ప్రశ్నించింది. నిజమే అనిపించింది.
నిప్పులేందే పొగ రాదన్నట్టు.. మరి ఎక్కడ జరిగింది పొరపాటు…? ఎవరు చేశారీ నేరం? స్కామ్ జరిగింది నిజమే. బాధితులు బోరుబోరున ఏడుస్తున్నారు నిజమే. మరి దీని వెనుక ఎవరున్నారు. మంగ్లీ పేరు ఎందుకు తెరపైకి వచ్చింది. ఇదే ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. చాలా మంది తమంతగా తాము ఓ నిర్ణయానికొచ్చేసి మంగ్లీని నేరస్తురాలిగా ట్రీట్ చేస్తూ సోషల్ మీడియాలో దాడికి దిగుతున్నారు. వ్యక్తిగత దూషణలతో ఆమెను ప్రతిష్ఠను మసక బార్చే ప్రయత్నమూ చేస్తున్నారు. అది కరెక్టు కాదు.
మంగ్లీ ఇంతలా మానసిక వేదకను గురువుతున్నా.. కరెక్టుగా తనకు తెలిసిన వివరాలు, సత్యాలు చెప్పడంలో మాత్రం వెనకడుగు వేస్తోంది. ఎందుకంటే.. ఆ స్కామ్‌లో ప్రధాన సూత్రధారులు ఆమె కుటుంబ సభ్యులున్నారు. అడ్వకేట్ సుబ్బారావు పలు యూ ట్యూబ్ ఇంటర్వ్యూలలో చెప్పిన విషయాలను పరిశీలిస్తే.. మంగ్లీ చెల్లె ఇంద్రావతి చౌహాన్‌ను పెళ్లి చేసుకోబోయే రమావత్ మధు దీనికి ప్రధాన సూత్రధారుడు.
తనో సంస్థ ఏర్పాటు చేస్తున్నాను. అందులో అన్ని రకాల పెట్టుబడులు స్వీకరికంచి .. దాని ద్వారా లాభాలు ఆర్జిస్తామని చెప్పారు. ఆ లాభాల్లో షేర్లు ఇవ్వడమే కాకుండా, పెట్టుబడి కింద ఇచ్చిన మొత్తానికి వడ్డీ నెలనెలా చెల్లిస్తాననే ఆశ చూపాడు. ఇన్వెస్టర్లను నమ్మించేందుకు తాను మంగ్లీ చెల్లెను వివాహం చేసుకోబోతున్నానని, మంగ్లీ ఫ్యామిలీతో.. మంగ్లీతో దిగిన ఫోటోలను కూడా అతను వాడుకున్నట్టు తెలుస్తోంది. పెట్టుబడులు పెట్టిన వారితో .. మంగ్లీకి కూడా ఇందులో భాగస్వామ్యం ఉందనే విధంగా మాయగాడు.. ఆమెను కలిపిస్తానని, ఫోటోలు కూడా దిగొచ్చని నమ్మబలికాడు. దీంతో చాలా మంది మధు వేసిన గాలానికి చిక్కినట్టు తెలిసింది.
డబ్బులు తీసుకునే వ్యవహార మంతా మంగ్లీ ఫ్లాట్‌లోనే జరగడం, ఆమె ఉన్న సమయంలో ఆమెతో సెల్ఫీ దిగేందుకు వచ్చిన జనంతో మంగ్లీ నిరాకరించడం.. ఇవన్నీ ముందుగా ఆమెకు ఏదో జరుగుతుదని సెన్స్ చెప్పి ఉంటుంది. లేదా ఇది ఫ్రాడ్ అనే విషయం తెలిసి ఉంటుంది. మరి దీంట్లో ముందుగానే ఎందుకు బయటపడలేక పోయింది. చెల్లె కోసం.. ఫ్యామిలీ కోసం తను బలైందా? ఇప్పటికీ ఆమె మీడియాను తిడుతున్నది.. తను నేరం చేయలేదంటున్నది. ఆ కుంభకోణంలో జీరో శాతం కూడా తన ప్రమేయం లేదని వాదిస్తున్నది. అంతా బాగానే ఉంది.
మరి రమావత్ మధుకు తన కుటుంబానికి ఉన్న సంబంధం.. చెల్లె, రమావత్ మధుకు పెళ్లి చేసుకుంటున్నారా? ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసింది నిజమేనా? అసలు రమావత్ మధు గురించి ఆమెకు ఏం తెలుసు? అతనే దీనికి ప్రధాన సూత్రధారి, పాత్రధారి అయితే… అసలు విషయం బయటపెట్టొచ్చు కదా.. తనే ఎందుకు బలి పశువుగా నిలబడాలి. కష్టపడి, స్వయంకృషితో నిర్మించుకున్న తన సౌధాన్ని తనే ఎందుకు కూల్చుకోవాలి? ఇవే ఇప్పుడు ఆమె జవాబివ్వాల్సిన ప్రశ్నలు.