మొన్నటి దాకా తెలంగాణకు బద్ద వ్యతిరేకిగా చంద్రబాబును అభివర్ణించిన బీఆరెస్.. ఒక్కసారిగా తన స్టాండ్ మార్చుకున్నది. చంద్రబాబును ఆకాశానికెత్తే పనిని ఎత్తుకున్నది. తాజాగా కేటీఆర్ చంద్రబాబు పాలనను మెచ్చుకుంటూ కామెంట్లు చేయడం చర్చకు వచ్చింది. బీఆరెస్ పార్టీ తీసుకోబోయే రాజకీయ స్టాండ్‌లో భాగంగా, వ్యూహాత్మకంగానే కేటీఆర్ ఈ మాటన్నారా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కావొచ్చు… సాధారణ ఎన్నికల్లో భాగంగా పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం ఉంటుందనే సంకేతం కావొచ్చు… కేటీఆర్ కితాబు వెనుక కారణమేమై ఉంటుందా అనే విశ్లేషణలు మొదలయ్యాయి.
బీజేపీతో భవిష్యత్తులో స్నేహ హస్తం అందుకోవాలని బీఆరెస్ ఉత్సాహంగా ఉందనే విషయం పలుమార్లు పరోక్షంగా వెల్లడైన విషయం తెలిసిందే. ఏపీలో చంద్రబాబు వ్యూహాత్మకంగా బీజేపీతో దోస్తానా చేయడం మూలంగా అక్కడ అధికారంలోకి రావడంతో పాటు.. కేంద్రంలో కూడా కీలక భూమిక పోషిస్తున్నాడు. ఏపీకి కావాల్సిన నిధులు రాబట్టుకోవడంలో కూడా ఈ పొత్తు కీలకంగా పని చేసింది. కేంద్రంతో స్నేహ పూర్వక వాతావరణంలో ఏపీలో రాజకీయ స్థితిగతులను, అక్కడ రాజధాని, అభివృధ్ది, సంక్షేమం విషయంలోనూ ఇతోధికంగా సకాలంలో సాయం పొందగలిగింది. ఇదే స్ట్రాటజీని బీఆరెస్ కూడా ఇక్కడ కొనసాగించాలనే యోచనలో ఉన్నట్టుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ పై దృష్టి పెట్టిన బీజేపీ.. ఒంటరిగా ఇక్కడ అధికారంలోకి రాదనే విషయాన్ని అధిష్టానం గ్రహించింది. గత కొంతకాలంగా బీజేపీ తీరు, నాయకుల వ్యవహార శైలి, గ్రూపులు.. ఇవన్నీ ఆ పార్టీని ఒంటరిగా అధికారంలోకి తెచ్చేందుకు దోహదం చేయవనే విషయాన్ని కనిపెట్టేసింది అధిష్టానం. అందుకే ఆ పార్టీకి స్థానికంగా బలంగా ఉన్న బీఆరెస్ అవసరం పడుతుంది. అందుకే ఈ రెండు పార్టీలు రానున్న రోజుల్లో ఒకటి కాబోతున్నాయనే విషయం పలు వేదికల ద్వారా, ప్రకటనల ద్వారా చెప్పకనే చెబుతున్నారు నేతలు.
అయితే, టీడీపీ కూడా హైదరాబాద్‌లో పోటీ చేయాలని భావిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని లిమిటెడ్ సీట్లకే పరిమితమైనా.. తాము ఉన్నామనే సంకేతాన్ని ఇచ్చేందుకు, ఉనికిని చాటుకునేందుకు రెడీ అయింది. రానున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలా? ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీకి లాభం చేకూరుతుందా? అనే అంశాన్ని ఆ పార్టీ అధినేత ఇప్పటి నుంచే పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బీఆరెస్ కూడా బీజేపీతో పాటు టీడీపీతో కలిసి సాధారణ ఎన్నికలకు పోతే? కూటమిగా ఏర్పడితే మరింత బలంగా కాంగ్రెస్‌పై పోటీ చేసే వీలుంటుంది కదా? అనే దోరణిలో రాజకీయ సమీకరణలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
అందుకే బీఆరెస్ పొలిటికల్ స్ట్రాటజీ మారుస్తున్నదా? అనే చర్చ తెలంగాణలో కొనసాగుతున్నది. చంద్రబాబు అంటేనే తెలంగాణకు వ్యతిరేకం అని మాట్లాడే బీఆరెస్ .. ఆ పార్టీ నేతలు ప్రస్తుత అవసరాలు, మారిన పొలిటికల్ సినారియోను అనుసరించి.. అధికారం చేపట్టడమే లక్ష్యంగా రాజకీయంగా పావులు కదుపుతున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది. డీలిమిటేషన్‌లో భాగంగా జనాభాను బట్టి పెరిగే నియోజకవర్గాలు.. హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉండనున్నాయి.
ఇక భవిష్యత్‌లో ప్రధాన రాజకీయమంతా రాజధాని చుట్టే ముడిపడి ఉన్న నేపథ్యంలో తమ బలాబలాలెంత? పొత్తులతో కలిసి వెళ్తే కలిసొచ్చే బలమెంత? అధికారం చేపట్టేందుకు అవసరమ్యే వ్యూహాలేమిటీ? మారుతున్న రాజకీయ సమీకరణలో జనం ఎలా ఆలోచిస్తున్నారు? బీజేపీతో కలిసి వెళ్లడంతో పాటు టీడీపీనీ కలుపుకుంటే జనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఇవన్నీ బీఆరెస్ సుధీర్ఘ ఆలోచనలో ఉన్నాయి. కేసీఆర్ రాజకీయ వ్యూహంలో ఇవి కీలకంగా మారనున్నాయి. ముందు ముందు దీనిపై మరింత క్లారిటీ రానుంది.