New Direct Flight to Japan: జపాన్‌కు వెళ్లాలనుకునే భారతీయ ప్రయాణికులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఢిల్లీ నుంచి జపాన్‌లోని ఒసాకాకు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించనుంది. 2027 ఫిబ్రవరి 2 నుంచి ఈ కొత్త సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. వారానికి నాలుగు రోజుల పాటు విమానాలను నడపాలని ఎయిర్‌లైన్ నిర్ణయించింది. దీంతో జపాన్‌లోని కన్సాయి ప్రాంతానికి వెళ్లాలనుకునే వారికి ప్రయాణం మరింత సులభం కానుంది.
ఎయిర్ ఇండియా ప్రకటించిన తాజా షెడ్యూల్ ప్రకారం.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒసాకాలోని కన్సాయి అంతర్జాతీయ విమానాశ్రయానికి నాన్‌స్టాప్ విమానాలు నడవనున్నాయి. ఈ మార్గంలో బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానాలను ఉపయోగించనుంది. ప్రయాణికులు మధ్యలో మరో విమానాన్ని ఎక్కాల్సిన అవసరం లేకుండా నేరుగా ఒసాకా చేరుకోవచ్చు. భారత్, జపాన్ మధ్య ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఈ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది.
ఈ మార్గంలో AI360 విమానం ఢిల్లీ నుంచి ఒసాకాకు మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం రోజుల్లో నడుస్తుంది. ఈ విమానాలు ఢిల్లీ నుంచి రాత్రి బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఒసాకా చేరుకుంటాయి. అదేవిధంగా, తిరుగు ప్రయాణంలో AI359 విమానం ఒసాకా నుంచి ఢిల్లీకి సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో నడవనుంది. ఈ సర్వీసులు ఒసాకా నుంచి మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రానికి ఢిల్లీ చేరుకునేలా షెడ్యూల్ రూపొందించారు. ఈ విమానాల్లో మొత్తం 259 సీట్లు ఉంటాయి. ఇందులో 18 బిజినెస్ క్లాస్ సీట్లు, 241 ఎకానమీ క్లాస్ సీట్లు అందుబాటులో ఉంటాయి.
జపాన్‌లోని ఒసాకా ప్రముఖ వాణిజ్య, పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచి క్యోటో, నారా వంటి చారిత్రక నగరాలకు ఈజీగా వెళ్లవచ్చు. పురాతన దేవాలయాలు, సంప్రదాయ ప్రాంతాలు, ప్రత్యేకమైన ఫుడ్ సెంటర్స్ తో పాటు యూనివర్సల్ స్టూడియోస్ జపాన్ లాంటి పర్యాటక ఆకర్షణలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఈ కొత్త విమాన సర్వీసులతో ఒకే నగరం నుంచి రాకపోకలు సాగించాల్సిన అవసరం లేకుండా, ఒసాకాలో పర్యటన ప్రారంభించి టోక్యో నుంచి తిరిగి రావడం వంటి మల్టీ సిటీ ట్రిప్స్ ను కూడా ప్లాన్ చేసుకోవచ్చు.
జపాన్‌కు వెళ్లే భారతీయుల సంఖ్య కూడా పెరుగుతోంది. జపాన్ నేషనల్ టూరిజం ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం, 2025లో 3.15 లక్షల మందికి పైగా భారతీయులు జపాన్ను సందర్శించారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది సుమారు 35 శాతం ఎక్కువ. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఢిల్లీ నుంచి టోక్యోలోని హనెడా విమానాశ్రయానికి రోజువారీ సర్వీసులు, ముంబై నుంచి టోక్యోకు వారానికి నాలుగు విమానాలు నడుపుతోంది. ఇప్పుడు ఒసాకా మార్గం కూడా చేరడంతో భారత్ నుంచి జపాన్‌కు ప్రయాణించే వారికి మరో ప్రత్యక్ష కనెక్షన్ అందుబాటులోకి రానుంది.
Read Also: ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!